Sep 15,2023 20:09

ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) :అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెర్లోపల్లి గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు (51) నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేసేవారు. పంట సాగు నిమిత్తం దాదాపు రూ.15 లక్షలు అప్పు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. అప్పులు తీర్చే మార్గంలేక తీవ్ర మనోవేధనకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న రామాంజనేయులును కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.