ప్రజాశక్తి-సి.బెళగల్/చాగలమర్రి, కొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు చేతికందక, అప్పుల భారం మోయలేక పురుగుల మందు తాగి తనువు చాలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నేలంపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు దూదేకుల బాష (45) తన రెండెకరాల సొంత పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, తదితర పంటలు సాగు చేసేవారు. గత కొన్ని సంవత్సరాలుగా పంటలు దక్కకపోవడంతో సాగు నిమిత్తం చేసిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. దీనికి తోడు ఈ నెల 31న నిర్వహించనున్న కుమార్తె పెళ్లికి డబ్బులు సమకూరకపోవడంతో మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన మైల సుధాకర్ (37) తన ఎకరా పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పలు పంటలు సాగు చేశారు. సాగు నిమిత్తం సుమారు రూ.నాలుగు లక్షలు అప్పు చేశారు. గత ఏడాది అధిక వర్షాల వల్ల, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక గ్రామ శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా సి బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన దీన్నే మద్దిలేటి (53) మూడేకరాల సొంత పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పలు పంటలు సాగు చేశారు. సాగు నిమిత్తం సుమారు రూ.ఐదు లక్షలు అప్పు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పంటలు చేతికందకపోవడంతో రుణభారం అధికమైంది. రుణదాతల ఒత్తిడి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.










