Jun 26,2023 10:33

కమ్మనైనది నా తెలుగు భాష
తల్లివంటిది నా మాతృభాష
తేనెలూరే మాటల్లో మృదుత్వం
భాషలలో గొప్పగా నిలిపింది

సాగరపు అంచు రంగులు
ముత్యాలు పోసి పొదిగింది
జగతి జాగృతికి ఆకారంగా నిలిచి
పరదేశీయులను పరవశింప చేసింది..

మాతృకైనది మహాకవులకు
దగ్గరైనది మట్టి మనుషులకు
గ్రంథ రచనకు సుగంధంగా వ్యాపించి
దివిటీల వెలుగులో దివ్యంగా ప్రకాశించే..

అందమైన ఆంధ్ర భాషగా వర్ధిల్లే
సొంపులెన్నో తిరిగి వినసొంపై వినిపించే
జాలువారే జలపాతంలా శబ్దం చేస్తూ
నదుల వెంట నాగరికత నేర్పింది...

పద్య రచనలో ప్రత్యేకత చాటి
తెలుగు వాడి సీసంతో మీసం మెలేసె
వీనులకు విందు చేస్తూ
పసందైన రుచులను పంచి పెట్టింది..

నవనీతమై పొంగుతుంది నా భాష
తేటమాటలలో పలుకుతూ
దేశమాతకు సౌభాగ్యం చేకూర్చింది
ఎల్లలు దాటి విశ్వవేదిక గీతం అయింది
 

- కొప్పుల ప్రసాద్‌
98850 66235