
- తెలంగాణకు చెందిన ఉమాహారతికి 3వ ర్యాంక్
- తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్
ప్రజాశక్తి- యంత్రాంగం : సివిల్స్-2022 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యుపిఎస్‌సి నిర్వహించిన ఈ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన నూకల ఉమాహారతి 3వ ర్యాంక్ సాధించారు. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు... నారాయణపేట జిల్లా ఎస్‌పిగా పని చేస్తున్నారు. ఎపిలోని తిరుపతికి చెందిన జివిఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి ఎల్‌ఐసి ఉద్యోగి. తల్లి టీచర్. వీరి కుటుంబం ప్రస్తుతం వైఎస్‌ఆర్ రైల్వేకోడూరులో ఉంటోంది. పవన్‌దత్తా తన తల్లిదండ్రుల కోరిక మేరకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఇటీవల ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ఆయనకు సివిల్స్‌పై మక్కువ ఎక్కువ. దీంతో, హైదరాబాద్‌లో కొంతకాలం సివిల్స్ శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే సఫలమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాల్లో 99వ ర్యాంకు తెచ్చుకొని సిమ్లాలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్‌లో ట్రైనీ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయన మళ్లీ సివిల్స్ రాసి గతం కంటే మెరుగైన ర్యాంకు సాధించారు. పట్నాయక్ తండ్రి ఎంఆర్‌కె పట్నాయక్ ఎల్‌ఐసి ఉద్యోగి. జక్కంపూడి రామ్మోహన్‌రావు ఫౌండేషన్ ట్రస్టీ సభ్యునిగా సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన శాఖమూరి అమర్, పద్మజ కుమారుడు సాయి అశ్రిత్ 40వ ర్యాంకు సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి ప్రణవ్ 60వ ర్యాంక్, ఆవుల సాయికృష్ణ 94, నిధి పారు (హైదరాబాద్) 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243, అకుర్ కుమార్ 257, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి 292, జి.సాయికృష్ణ 293, వీరగంధం లకీëసుజిత 311, ఎన్.చేతనరెడ్డి 346, ఎస్.శృతి యారగంటి 362, సోనియా కటారియా 376, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇప్పలపల్లి సుష్మిత 384, రేవయ్య 410, సిహెచ్.శ్రావణకుమార్‌రెడ్డి 426, బిల్లివిల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866 ర్యాంకులతో మెరిశారు.
ఊహించలేదు
సివిల్స్‌లో మూడో ర్యాంకు ఊహించలేదు. ఐదేళ్ల నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఓటములను చవిచూశాను. నాన్న స్ఫూర్తితో, కుటుంబం సహకారంతో ఏనాడూ నిరాశ చెందలేదు. ఐఐటి హైదరాబాద్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు. కుటుంబం ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చు.
- నూకల ఉమాహారతి, సివిల్స్ థర్డ్ ర్యాంకర్