బాపట్ల : ' చందమామ రావే జాబిల్లి రావే ' అంటూ తెలుగు సినీ సాహిత్యంలో పున్నమి వెన్నెలలు కురిపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దాదాపు 800 సినిమాలలో 3000 పైచిలుకు పాటలు రచించారని రావూరి నరసింహ వర్మ తెలియజేశారు. నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి 68 వ జయంతిని పురస్కరించుకొని... సాహితీ భారతీ ఆధ్వర్యంలో జరిగిన సభకు సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ ... అశ్లీలత, అసభ్యత, ద్వంద్వార్థాలకు ఏమాత్రం తావివ్వకుండా సీతారామశాస్త్రి సాహిత్య సృజన చేశారని కొనియాడారు. వారు 11 నంది అవార్డులు 4 ఫిలింఫేర్ అవార్డులతో పాటు పద్మశ్రీ అవార్డుతో కూడా సత్కరింపబడ్డారని ప్రశంసించారు. ఆదిభిక్షువు వాడినేమి కోరేది, జగమంత కుటుంబం నాది, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, బలపం పట్టి భామ బడిలో, బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది.. తదితర వైవిధ్యభరిత గీతాలతో తెలుగు సినీ సాహిత్యానికి సిరివెన్నెల గొప్ప సిరిని సమకూర్చారని సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ కొనియాడారు. ఈ సభలో ఎం.జాకబ్, ఎన్.కృష్ణ, కస్తూరి.శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, తదితరులు సిరివెన్నెల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.










