పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు కొనిస్తాం.. కార్లు, స్కూటర్లు, ఆటోలు, విమానాలతో పాటు కాస్త ధర ఎక్కువైనా బార్బీ బొమ్మలు కూడా కొంటాం.. ఆ బొమ్మలతో పిల్లలు భలే సరదాగా ఆడుకుంటారు. ఆట మధ్యలో 'ఇదేంటి.. దీని పేరేంటి.. ఈ బొమ్మ ఎవరు తయారు చేస్తారు.. ఎక్కడి నుండి వచ్చింది..' అంటూ సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. 'అలా ప్రశ్నించడం.. పిల్లల సహజ లక్షణం. ఆ బొమ్మల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే క్రమంలో నా ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలు తయారుచేయాలనుకున్నాను' అంటూ యానిమేషన్ కెరియర్‌లో పదేళ్ల అనుభవాన్ని పక్కనబెట్టి అస్సాంలోని ఓ కుగ్రామానికి చేరుకున్నాడు 32 ఏళ్ల కిరాత్ బ్రహ్మ. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులతో బొమ్మలు తయారుచేసేందుకు 'జంక్లా స్టూడియో'ను స్థాపించి స్థానికులను అందులో భాగస్వామ్యం చేశాడు. ఆ గ్రామస్తులు తయారుచేసిన బొమ్మలు అస్సాం ప్రజల వస్త్రధారణను, వారి అలంకరణలను, పూర్వీకుల చరిత్రను, ఆ ప్రాంతానికే పరిమితమైన రకరకాల పక్షులు, జంతువులను ప్రతిబింబిస్తూ తయారవుతున్నాయి.

ఇండియా, భూటాన్ సరిహద్దుల్లో ఉన్న బక్సా జిల్లాలో ఓ కుగ్రామంలో పుట్టిన కిరాత్, జానపద కథలు వింటూ పెరిగాడు. 'నేను విన్న ఆ కథల్లో ఆ ప్రాంత వీర మహిళలు, రైతులు, వృత్తిదారులు, జంతువులు, పక్షులు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకు ఆ కథలు ఎవరూ చెప్పడం లేదు. ఆన్‌లైన్లో దొరికే విషయాలకే పిల్లలు బానిసలైపోతున్నారు. అక్కడ చూసే బొమ్మలనే ఆటవస్తువులుగా మార్చుకుంటున్నారు. అది మన మూలాలను ఛిద్రం చేస్తుంది. క్రమేణా మన ప్రాంతానికే పరిమితమైన ఎన్నో చారిత్రక ఘట్టాలు కనుమరుగైపోతాయి. ఆ భావన రాగానే చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశా'నని తన తొలి అడుగులు గురించి చెబుతున్న కిరాత్, 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడి)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 'యానిమేషన్ డిజైనర్‌గా దేశవ్యాప్తంగా ఎంతోమందితో పనిచేశాను. నా పనిలో ఎప్పుడూ కొత్తదనం ఉండాలనుకునేవాడ్ని. అలా యానిమేషన్‌లో రకరకాల డిజైన్లు తయారుచేశాను. ఇంత చేస్తున్నా నా మనసు ఎప్పుడూ గ్రామం చుట్టూనే తిరుగుతూ ఉండేది.
పనిలో భాగంగా నేను దేశంలో చాలా ప్రాంతాలు తిరిగాను. అక్కడ ఎవరికీ నా ప్రాంతం మీద కనీస అవగాహన కూడా లేదు. అది నన్ను ఎంతో బాధించింది. 2020 లాక్‌డౌన్ పడినప్పుడు గ్రామానికి తిరిగివచ్చాను. ఆ విరామ సమయంలో వచ్చిన ఆలోచనే 'జంక్లా స్టూడియో' అంటూ తన ప్రాజెక్టుకు ప్రేరేపించిన సంగతులను వివరిస్తున్నాడు.

జానపద పాత్రలే నా బొమ్మలు
అస్సాం బోడా సంస్కృతిని రాబోయే తరాలకు పరిచయం చేయాలనుకున్న కిరాత్, పిల్లలు ఆడుకునే బొమ్మల ద్వారా తన చరిత్రను ప్రచారం చేయాలనుకున్నాడు. అలా 2021లో చేతితో తయారు చేసే, ప్లాస్టిక్ రహిత, మృదువైన బొమ్మల తయారీపై దృష్టి పెట్టాడు. 'పిల్లలు ఆడుకునే బొమ్మలంటే మార్కెట్ అంతా స్పైడర్ మ్యాన్, మిక్కీ మౌస్, బార్బీ బొమ్మలతో నిండిపోయింది. ఆ మార్కెట్లో నా బొమ్మలకు కూడా స్థానం కల్పించాలనుకున్నాను. ఈ ప్రాంత గిరిజన సంస్కృతి, బోడో ప్రయాణికుడు, బోడో జ్వుహాలా, బోడో యుద్ధ వీరుడు, గౌదంగ్ రాణి, బోడో యువరాణి బొమ్మలు సాంప్రదాయ దుస్తులతో వాటి చరిత్రను చెబుతాయి. ఈ బొమ్మలు తయారుచేసేందుకు ఎంతో పరిశోధన చేశాను. జానపద కథల నుండి ఎంతో స్ఫూర్తి పొందాం' అంటూ తన బొమ్మల కథ చెబుతున్నాడు.
స్థానిక యువతకు ఉపాధి మార్గంగా..
అస్సాం ప్రాంతంలో ఎక్కువ మంది యువత ఉపాధి అవకాశాల కోసం సుదూరాలు ప్రయాణిస్తుంటారు. ఆర్మీలో కూడా చేరతారు. 'ఇప్పుడు నేను చేసిన ఈ ప్రయత్నంతో అటువంటి వారికి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మా బృందం తక్కువ ఉత్పత్తులే తయారుచేస్తూ ఉండొచ్చు. కాని భవిష్యత్తు కాలంలో ఆర్డర్లు పెరిగేలా కృషి చేస్తాను' అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కిరాత్.

ఆ ఆర్డర్ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది..
కిరాత్ తయారుచేస్తున్న ఉత్పత్తుల గురించి తెలుసుకున్న ముంబయికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఆమె జన్మదినం సందర్భంగా కిరాత్‌కు పెద్ద ఆర్డరు ఇచ్చింది. 'నేను ఆమె ఉంటున్న చోటుకు ఓ మూల ఎక్కడో దేశ సరిహద్దుల్లో ఉన్నాను. కానీ ఆ ఆర్డరు వచ్చింది. అప్పుడు మా బృందం చాలా సంతోషించింది. ఇటువంటి ప్రోత్సాహం మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది' అంటూ సంతోషంగా చెబుతున్నాడు కిరాత్.

ఈ బట్టలేంటి ఇలా ఉన్నాయి..
'ఒకసారి నా మేనకోడలికి కిరాత్ బృందం తయారుచేసిన బొమ్మను బహుమతిగా ఇచ్చాను. ఆ బొమ్మను తీసుకుని పాప చాలా సంతోషించింది. 'ఈ బొమ్మ బట్టలేంటి ఇలా ఉన్నాయి.. ఇలాంటివి ఎక్కడ ధరిస్తారు' అంటూ ఆ చిన్న పాప అడిగినప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు కిరాత్ నాతో అన్నమాటలు గుర్తుకొచ్చాయి. అతని లక్ష్యం నెరవేరుతుందని అనిపించింది కూడా..' అంటూ విభా కమత్ అనే కొనుగోలుదారు తన అనుభవాన్ని పంచుకున్నారు.










