చదువుకునే యుక్త వయస్సు పిల్లలకు ఆర్థిక విషయాలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు నిపుణులు. దాంతో పాటు పొదుపు చేయడం కూడా నేర్పించాలి. డబ్బు విలువ తెలుసుకునేలా చేయడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులకు ఆర్థిక పాఠాలు బోధించాలంటే కొంచెం కష్టమే! కానీ, నేర్పుగా చెప్పకపోతే భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు ఆర్థిక నిపుణులు.
- తల్లిదండ్రులకు ఆస్తి, ఆదాయం, జీతం ఎంత ఉంటుందో పిల్లలకు పెద్దగా అవగాహన ఉండదు. దాంతో పిల్లలుగా వారు చూసిందల్లా కావాలనుకోవడం, దాన్ని తల్లిదండ్రులుగా మీరు కొనిపెట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు. అందుకే వారికి ఇంటి ఆర్థిక విషయాలు తెలియజేయాలి.
- మీ ఇంట్లో నెలకు ఎంత ఖర్చు అవుతుంది? ఆదాయం ఎంత వస్తుంది వంటివి చర్చించాలి. అవసరమైతే వారి చేత లెక్కలు వేయించాలి. అప్పుడే వారికి ఇంటి ఆర్థిక పరిస్థితి తెలుస్తుంది. ఇంటి బడ్జెట్‌లో వారి కోసం ఎంత ఖర్చు పెడుతుంది. సినిమాలు, షాపింగ్, ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఖర్చులను రాయమని వారిని అడగండి. వారానికొకసారి దాన్ని సరిచూసుకోమని గుర్తు చేయండి. అప్పుడే ఏది అవసరం, అనవసరమైనవో వారి ఆలోచించి ఖర్చు పెడతారు.
- ఇంట్లో ముఖ్యమైన నెలవారీ బిల్లులను కరెంట్, టీవి, పాలు, ఈఎంఐలు, కిరాణా సరుకులు వారిచేత కట్టించండి. దాంతో ఇంట్లో ప్రతినెలా ఎంత ఖర్చు అవుతుందో తెలుస్తుంది. అప్పుడే ఏది కొనుగోలు చేయాలి? చేయకూడదో ఎదిగేకొద్దీ అర్థమవుతోంది.
- స్నేహితులతో బెట్టింగ్‌లు, ఇంటర్‌నెట్‌కు, స్నేహితులతో పార్టీల కోసమని పెట్టే ఖర్చు విషయాలపై విపులంగా చెప్పండి. వాటివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేయండి. అంతేకాదు... నెలకు కొంత డబ్బును వారి చేతికే ఇచ్చి పొదుపు ఖాతాల్లో జమ చేయమని చెప్పండి. ఇటువంటి చర్యలు వారి తప్పకుండా మార్పును తీసుకొస్తాయంటున్నారు ఆర్థిక నిపుణులు.










