ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : సాంప్రదాయ కవిత్వాన్ని పటాపంచలు చేస్తూ... వచన కవిత్వంతో తెలుగు సాహిత్యానికి ఆధునిక వైభవం అద్దిన ప్రజాకవి శ్రీశ్రీ అని కడియం ఎంఈఓ వి.లజపతిరాయ్ , సాహితీవేత్త తోరాటి వసంతరావు లు అన్నారు. ఫిలాంత్రపిక్ సొసైటీ అధ్యక్షులు అద్దంకి రాజాయోనా, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళా సేవాసమితి అధ్యక్షులు అడపా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కడియం శాఖా గ్రంథాలయంలో ఆదివారం శ్రీ శ్రీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహితీ చరిత్రలో శ్రీ శ్రీ ది అజరామర ప్రస్థానమని వారు అన్నారు. చందస్సును చెరిపేసి భావాలకి, మనోభావాలకి పెద్దపేట వేస్తూ గర్జించే పదాలతో గంభీరంగా ఆకలి కేకలు వినిపించిన కవిత్వం శ్రీ శ్రీదన్నారు. కష్టజీవుల కోసం సాహితీ సఅజన చేసిన ప్రజాకవని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, అభ్యుదయ రచయిత చిలుకూరి శ్రీనివాసరావు కు శ్రీశ్రీ స్మారక అవార్డు అందించి ఘనంగా సత్కరించారు. పర్యావరణం, సామాజిక సమస్యలు, పేదల కష్టాల పై నిరంతరం కవితలు సంధించే చిలుకూరికి శ్రీ శ్రీ అవార్డు ఎంతో సముచితమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారిణి శ్రీదేవి, ఉపాధ్యాయులు పితాని సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, కళాకారులు బొర్రా రామకృష్ణ , ఐ.నరసింహ, తూలూరి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.