Apr 30,2023 12:40

ప్రజాశక్తి- కర్నూలు కల్చరల్‌ : భారతీయ సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన మహాకవి శ్రీశ్రీ అని నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య అన్నారు. ఆదివారం నగరంలోని టిజీవి కళాక్షేత్రం ఆధ్వర్యంలో కళాక్షేత్రం సాహిత్యవేదిక సమావేశ మందిరంలో శ్రీశ్రీ 113 జయంతి సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ ... శ్రీశ్రీ భావకవిగా, అభ్యుదయ కవిగా, చివరకు విప్లవకవిగా మారి రైతులు పేదలు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కవిత రాశారని ఆయన జీవితమంతా సమాజంపై తిరుగుబాటు కవితలు రాశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు పాల్గొని శ్రీ శ్రీ చిత్రపటానికి పుష్పమాల వేసి ఆయన మహౌన్నత సాహిత్య సేవలను కొనియాడారు. దర్శకులు పల్లేటికులశేఖర్‌ మాట్లాడుతూ .... 1934లో ఆయన మరో ప్రపంచం కవితను రాశారని ఆ కవిత రాయడానికి కేవలం ఐదు నిమిషాలే పట్టిందని ఒక పెన్సిల్‌ తో ఆ కవితను రాయడం జరిగిందని తెలిపారు. శ్రీశ్రీ మహాప్రస్థానం నాటికీ, నేటికి, ఏనాటికి అజరామరంగా కవులకు ఆదర్శప్రాయంగా ఉంటుందన్నారు. శ్రీశ్రీ అభ్యుదయవాదిగా ఉన్న ఆయన రాసిన అనేక సినిమా పాటలు జనాదరణ పొందాయని ముఖ్యంగా డబ్బింగ్‌ సినిమాలకు మాటలు, పాటలు రాయటంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. నేటి బాలబాలికలు శ్రీ శ్రీ కవితలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఎమ్మార్వో శంకరప్ప, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కన్వీనర్‌ జేయన్‌.శేషయ్య, టీజీవి కళాక్షేత్రం సభ్యులు పిపీ గురుమూర్తి, సంగా ఆంజనేయులు, లక్ష్మీకాంత రావు, సివి.రెడ్డి, బాలవెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.