
- యాప్‌లో ఫొటో కోసం మండుటెండలో కార్మికుల నిరీక్షణ
- వేసవి అలవెన్స్‌కు కేంద్రం మంగళం
- దక్కని కనీస వేతనం
ప్రజాశక్తి- యంత్రాంగం : వామపక్షాల కృషి ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వర్యీం చేయడానికి కుట్రలు చేస్తోంది. వివిధ రకాల నిబంధనలతో ఉపాధి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఒక్క పూట పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు రెండు పూటలా పని చేయాల్సి వస్తోంది. ప్రజాశక్తి సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉపాధి కార్మికుల వెతలు బహిర్గతం అయ్యాయి. ఉపాధి నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందన్న పేరులో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్)ను తీసుకొచ్చి యాప్ ద్వారా ఉపాధి పనులను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులు పని చేస్తున్నప్పుడు రోజుకు రెండుసార్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి వస్తోంది. సిగల్ సమస్య వల్ల ఈ ప్రక్రియ సజావుగా సాగక అవస్థలు తప్పడం లేదు. మేట్లు తనకు కేటాయించిన 50 మంది కార్మికులను ఐదు గ్రూపులుగా విభజించి పని ప్రాంతం వద్ద లొకేషన్ ఆధారంగా వారందరికీ ఫొటోలు తీయాలి. ఉదయం ఏడు గంటలకు ఒకసారి, మరలా నాలుగు గంటల తర్వాత అంటే 11 గంటలకు మరోసారి ఫొటో తీసి యాప్‌లో నమోదు చేయాలి. ఇలా చేస్తేనే ఆ రోజు పనిచేసిన దానికి కూలి వస్తుంది. లేకుంటే కూలి డబ్బులు రావు. పని ప్రదేశంలో అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో, ఫొటోల ఆప్‌లోడ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో, ఫొటో అప్‌లోడ్ అయ్యే వరకూ నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం 5.30 గంటలకు పనికి వెళ్లినా ఫొటోల అప్‌లోడ్ కోసం మండుటెండలో మధ్యాహ్నం 12 గంటల వరకు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తోంది. కాకినాడ జిల్లా కరప మండలం గొర్రెపూడిలో కాలువ పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ గ్రామంలో 642 ఉపాధి కార్మికులకుగానూ 194 మంది శనివారం పనికి హాజరయ్యారు. ఫొటోల అప్‌లోడ్‌కు ఎక్కువ సమయం పడుతోందని, తరచూ ఈ విధంగా జరుగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ మండుటెండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని ఉపాధి కార్మికులు మెడిశెట్టి నాగు, కోట చిన్న, అప్పారావు తదితరులు తెలిపారు. కాకినాడ జిల్లాలో సుమారు 87 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వీరిలో అత్యధికులు సాంకేతిక సమస్యలతో రోజూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేసవిలో అందించే సమ్మర్ అలవెన్సులకు కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి మంగళం పలికింది. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం సమ్మర్ అలవెన్స్ అందించేవారు. కనీస కూలి రూ.273 రావాల్సి ఉండగా విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల రూ.200తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వేసవి అలవెన్స్ కొనసాగించాలని, పాత విధానంలోనే మస్టర్లు వేయాలని, కనీస వేతనం అమలు చేయాలని ఉపాధి కార్మికులు కోరుతున్నారు.
ఫొటో తీసిన తర్వాతే ఇంటికి పంపుతున్నారు
సర్వర్ మారిందని చెబుతూ సెల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీస్తున్నారు. మేమంతా ఉదయం ఆరు గంటలలోపే పని ప్రదేశానికి చేరుతున్నాం. సాంకేతిక సమస్యల వల్ల ఫొటోలు అప్‌లోడ్ కాక ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాత పద్ధతిలోనే మస్టర్లు వేయాలి.
- పల్లేటి సీత, ఉపాధి కార్మికురాలు, అమీనాబాధ, యు.కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా