Nov 03,2023 10:01

శ్రీలంకపై 302పరుగుల తేడాతో గెలుపుతో సెమీస్‌కు
బ్యాటింగ్‌లో గిల్‌, కోహ్లి, శ్రేయస్‌... బౌలింగ్‌లో షమీ, సిరాజ్‌...

ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పలు రికార్డులను నెలకొల్పింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా ఏడు మ్యాచుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. అలాగే మహ్మద్‌ షమీ(5/18) బౌలింగ్‌లో మెరిసి.. వన్డే ప్రపంచకప్‌లో 45వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో జహీర్‌ఖాన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌(44వికెట్లు) రికార్డును చెరిపేసాడు. అలాగే విరాట్‌ కోహ్లి వ్యక్తిగత స్కోర్‌ 34 పరుగుల వద్ద ఈ ఏడాది వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని టీమిండియా తరఫున అత్యధికసార్లు ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న సచిన్‌(11) సరసన నిలిచాడు.
ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రికార్డులు నెలకొల్పుతోంది. వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో గురువారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 357పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు 19.3ఓవర్లలో 55పరుగులకే కుప్పకూలింది. షమీ(5/18), సిరాజ్‌(3/16) బౌలింగ్‌లో మెరిసారు.
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(4) ఔటయ్యాడు. మధుశంక వేసిన రెండో బంతికి రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (92), విరాట్‌ కోహ్లీ(88) అర్ధసెంచరీలతో మెరిసారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 189పరుగులు జతచేశారు. వీరు రన్‌ రేట్‌ 6కు తగ్గకుండా ఆడారు. అయితే సెంచరీలకు చేరువవుతున్న క్రమంలో మధుశంక భారత్‌కు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. 30వ ఓవర్లో గిల్‌ను ఔట్‌ చేసిన మధుశంక.. మరుసటి ఓవర్లో కోహ్లీని కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కెఎల్‌ రాహుల్‌(21), శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసి నాల్గో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. 40వ ఓవర్లో ఛమీరా బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఆ సమయానికి భారతజట్టు స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 276పరుగులు. టి20 స్పెషలిస్ట్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(12) పేలవ ఫామ్‌ మరోసారి కొనసాగింది. చివర్లో శ్రేయాస్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కసున్‌ రజిత వేసిన 36వ ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన అయ్యర్‌.. తీక్షణ వేసిన 41వ ఓవర్లో లాంగాఫ్‌ మీదుగా అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన అయ్యర్‌.. మధుశంక వేసిన 48వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు మూడోబంతినీ సిక్సర్‌ కొట్టేందుకు ప్రయత్నించి తీక్షణ చేతికి చిక్కాడు. చివర్లో రవీంద్ర జడేజా (35) ధాటిగా ఆడటంతో భారత్‌ 350 పరుగుల మైలురాయిని దాటింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్‌ మధుశంకకు ఐదు, ఛమీరాకు ఒక వికెట్‌ దక్కాయి.
భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే నిస్సంక(0) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కరుణరత్నే, సమరవిక్రమ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్‌కు చేరడంతో లంక జట్టు 2పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్‌ వరుసగా వికెట్లు తీయడంతో లంక జట్టు 29పరుగులకే 8వికెట్లు కోల్పోయి ఓటమికోరల్లో నిలిచింది. చివరి రెండు వికెట్లకు లంక 26పరుగుల జతచేయడంతో ఊపిరి పీల్చుకుంది. బుమ్రా(1/8), జడేజా(1/4)కి తోడు షమీకి ఐదు, సిరాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ సిరాజ్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి)మధుశంక 4, శుభ్‌మన్‌ (సి)కుశాల్‌ మెండీస్‌ (బి)మధుశంక 92, కోహ్లి (సి)నిస్సంక (బి)మధుశంక 88, శ్రేయస్‌ (సి)తీక్షణ (బి)మధుశంక 82, కెఎల్‌ రాహుల్‌ (సి)హేమంత (బి)ఛమీర 21, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి)కుశాల్‌ మెండీస్‌ (బి)మధుశంక 12, జడేజా (రనౌట్‌) సమరవిక్రమ/కుశాల్‌ మెండీస్‌ 35, షమీ (రనౌట్‌)కుశాల్‌ మెండీస్‌ 2, బుమ్రా (నాటౌట్‌) 1, అదనం 20. (50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 357పరుగులు.
వికెట్ల పతనం: 1/4, 2/193, 3/196, 4/256, 5/275, 6/233, 7/355, 8/357
బౌలింగ్‌: మధుశంక 10-0-80-5, ఛమీర 10-2-71-1, రజిత 9-0-66-0, మాధ్యూస్‌ 3-0-11-0, తీక్షణ 10-0-67-0, హేమంత 8-0-52-0.
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిస్సంక (ఎల్‌బి) బుమ్రా 0, కరుణరత్నే (ఎల్‌బి)సిరాజ్‌ 0, కుశాల్‌ మెండీస్‌ (బి)సిరాజ్‌ 1, సమరవిక్రమ (సి)శ్రేయస్‌ (బి)సిరాజ్‌ 0, అసలంక (సి)జడేజా (బి)షమీ 1, మాధ్యూస్‌ (బి)షమీ 12, హేమంత (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)షమీ 0, ఛమీర (సి)కెఎల్‌ రాహుల్‌ (బి)షమీ 0, తీక్షణ (నాటౌట్‌) 12, రజిత (సి)శుభ్‌మన్‌ (బి)షమీ 14, మధుశంక (సి)శ్రేయస్‌ (బి)జడేజా 5, అదనం 10. (19.4ఓవర్లలో ఆలౌట్‌) 55పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/2, 3/2, 4/3, 5/14, 6/14, 7/22, 8/29, 9/49, 10/55
బౌలింగ్‌: బుమ్రా 5-1-8-1, సిరాజ్‌ 7-2-16-3, షమీ 5-1-18-5, కుల్దీప్‌ 2-0-3-0, జడేజా 0.4-0-4-1.
షమీ రికార్డు..
ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ ఓ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై షమీ(5/14) అద్భుత బౌలింగ్‌తో మెరిసాడు. ఈ ప్రపంచకప్‌లో కేవలం మూడు మ్యాచుల్లోనే 14 వికెట్లు తీసిన షమీ.. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 45వికెట్లు తీసినట్లయ్యింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన జహీర్‌ ఖాన్‌(44వికెట్లు) రికార్డును షమీ బ్రేక్‌ చేశాడు.