Sep 06,2023 09:55
  • కేఎల్‌ రాహుల్‌ ఇన్‌.. సంజు శాంసన్‌ ఔట్‌..
  • తిలక్‌వర్మ, అశ్విన్‌, ప్రసిధ్‌ కృష్ణకు మొండిచెయ్యి
  • వన్డే ప్రపంచకప్‌కు 15మంది జట్టు ఇదే!
  • బిసిసిఐ సెలెక్షన్‌ కమిటీ

ముంబయి: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు ఎవరెవరు ఆడనున్నారో.. అనే ఉత్కంఠ వీడింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సెలెక్షన్‌ కమిటీ 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా వ్యవహరించనున్నారు. టాప్‌ ఆర్డర్‌లో శుభమన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ ఉండగా.. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, బరిలోకి దిగనున్నారు. బౌలర్ల విభాగంలో శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, షమీతో టీమిండియా దుర్భేద్యఫామ్‌లో ఉంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ ఉండనే ఉన్నారు. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌, టి20 స్పెషలిస్ట్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక స్టాండ్‌బై వికెట్‌ కీపర్‌ కోటాలో కేఎల్‌ రాహుల్‌కు చోటు కల్పించింది. గాయాల నుంచి కోలుకున్న శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌పై నమ్మకముంచిన సెలెక్టర్లు.. ఐపిఎల్‌లో రాణించిన హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్‌ ప్రసిధ్‌ కృష్ణకు మొండిచెయ్యి చూపింది. సంజూ శాంసన్‌ స్థానంలో గాయం నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌కు చోటు దక్కింది. గత 18 ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ కొట్టని సూర్యకుమార్‌ యాదవ్‌పై నమ్మకముంచిన సెలెక్టర్లు మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యం, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌లకు జట్టులోకి తీసుకుంది. బెంగళూరులోని బిసిసిఐ నేషనల్‌ అకాడమీలో గాయాలనుంచి వీరిద్దరూ కోలుకొని ఆసియాకప్‌లో ఆడుతున్నారు. ఇక పేసర్ల కోటాలో ప్రసిధ్‌ కృష్ణకూ నిరాశ తప్పలేదు.
వన్డే ప్రపంచకప్‌కు జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా.