Sep 22,2023 22:07

గైక్వాడ్‌, శుభ్‌మన్‌, సూర్యకుమార్‌, కెఎల్‌ రాహుల్‌ అర్ధసెంచరీలు
షమీకి ఐదు వికెట్లు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
మొహాలీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.4ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌(3) నిరాశపరచగా.. గైక్వాడ్‌, శుభ్‌మన్‌, సూర్యకుమార్‌, కెఎల్‌ రాహుల్‌ అర్ధసెంచరీలతో మెరిసారు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను మహ్మద్‌ షమీ(5/51) కట్టడి చేశాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 276పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌(4)ను అవుట్‌ చేసిన షమీ... ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌(41), స్టొయినిస్‌ (29), మాథ్యూ షార్ట్‌ (2), షాన్‌ అబ్బాట్‌ (2) వికెట్లు తీశాడు. డేవిడ్‌ వార్నర్‌(52) మాత్రమే అర్ధసెంచరీతో మెరిసాడు. లబుషేన్‌ 39, కామెరాన్‌ గ్రీన్‌ 31, వికెట్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌ 45 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ బ్యాట్‌ ఝళిపించాడు. కమిన్స్‌ 9 బంతుల్లో 2ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బుమ్రా, అశ్విన్‌, జడేజాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో టీమిండియా ఓపెనర్లు గైక్వాడ్‌(71), శుభ్‌మన్‌(74) తొలి వికెట్‌కు 142పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత శ్రేయస్‌ నిరాశపరిచినా.. కేఎల్‌ రాహుల్‌(58నాటౌట్‌), సూర్యకుమార్‌(50) అర్ధసెంచరీలతో మెరిసారు. 48పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫోర్‌, సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్‌ 48.4ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 281పరుగులు చేసి గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1ా0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే ఇండోర్‌ వేదికగా ఆదివారం జరగనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మహ్మద్‌ షమీకి లభించింది.