పేస్ బౌలింగ్‌పైనే ప్రధాన దృష్టి
కొలంబో: ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగే సూపర్ 4 మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన టీమిండియా.. ప్రధానంగా పేస్ బౌలింగ్‌పైనే దృష్టి సారించింది. గురువారం వర్షం పడడంతో భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ను ఇండోర్ స్టేడియంలో సాధన చేశారు. కొలంబోలో గురువారం ఉదయం నుంచే వర్షం ప్రారంభమైంది. దాంతో, అందరూ ఇండోర్‌లో చెమటోడ్చి ప్రాక్టీస్ చేశారు. తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ కూడా బ్యాటింగ్ చేశాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బిసిసిఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్.. సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్‌కు సలహాలిస్తూ కనిపించారు. సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్ జట్టు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఈసారి హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక నేపాల్‌తో మ్యాచ్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా కూడా పాక్‌తో మ్యాచ్‌కు ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది.
అకెర్మన్, మెర్వ్‌లకు పిలుపు..
వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఇదే!
ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో సీనియర్ బ్యాటర్లు అకెర్మన్, వాన్ డెర్ మెర్వ్‌లకు చోటు దక్కింది. నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించిన 15మందితో కూడిన జట్టుకు స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో వీరిద్దరూ ఆడలేదు. ఇక తెలుగు రాష్ట్రానికి చెందిన తేజ నిడమనూరుకు నెదర్లాండ్స్ ప్రపంచకప్ జట్టులో చోటుదక్కింది. ఆల్‌రౌండర్ అయిన తేజ.. విజయవాడలో పుట్టి నెదర్లాండ్స్ జాతీయ జట్టుకు 2022 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ సత్తాచాటింది. సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించి చివరి బెర్తును సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్ ఆడటం ఇది ఐదోసారి. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆడింది. ఈ ఏడాది ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా (అక్టోబర్ 6న) జరగనుంది.
నెదర్లాండ్స్ జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.










