
లఖ్‌నవూ: సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఎదురు లేకుండా సాగిపోతోంది. ఇప్పటివరకు ఓటమి అనేదే లేకుండా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది.
ఆ జట్టు బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. లివింగ్‌స్టోన్ (27) టాప్ స్కోరర్. జానీ బెయిర్‌స్టో (14), డేవిడ్ మలన్ (16) పరుగులు చేయగా.. జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. బట్లర్ (10), మొయిన్ అలీ (15), క్రిస్‌వోక్స్ (10) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. షమి (4/22), బుమ్రా (3/32), కుల్‌దీప్ యాదవ్ (2/24) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
భారత ఆటగాళ్లలో టాప్ ఆర్డర్‌లోని శుభ్‌మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (4) తీవ్రంగా నిరాశపర్చగా.. రోహిత్ శర్మ (87బీ 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ ముంగిట ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ (39బీ 58 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా.. రవీంద్ర జడేజా (8) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ (49బీ 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు.
40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. ముఖ్యంగా రోహిత్ బౌండరీలు బాది స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. అతడికి రాహుల్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔటైన తర్వాత సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించి జట్టు స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, ఆదిల్ రషీద్ 2, మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.