Jul 30,2023 07:02

ఒకపక్క సమాజం ఆధునిక పోకడలతో సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళుతుంటే.. మరోపక్క తొలితరం వారసులు స్కూలుకు వెళ్లేందుకు కూడా కనీస సదుపాయాలు లేని జనావాసాలున్నాయి. అటువంటి ప్రాంతమే మినాప్‌. ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఊరికి దూరంగా, అడవి మధ్యలో ఉన్న అక్కడ చుట్టుపక్కల గ్రామాల మొత్తం జనాభా 900 కూడా దాటదు. అటువంటి చోట ఆ అడవి బిడ్డలూ చదువుకోవాలని ఓ యువకుడు ఆరాటపడుతున్నాడు. అతడి మాటల్లోనే ఆ ఊరి కథ విందాం.
''నా పేరు హుర్రా. మా గ్రామం నక్సల్స్‌, సాయుధ పోలీసుల రాకపోకలతో నిరంతరం ఉద్రిక్తతలతో నిండి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఊళ్లో స్కూలు లేక హాస్టల్లో ఉండి చదువుకున్నాను. సెలవుల్లో ఊరికి వస్తే ఇక్కడి పరిస్థితులు చూసి చాలా భయమేసేది. ఊరు దాటేటప్పుడు, ఊళ్లోకి వెళ్లేటప్పుడు పోలీసులు తనిఖీలు ఉండేవి. ఒక్కోసారి నక్సల్స్‌ కూడా మాపై నిఘా పెట్టేవారు. మా ప్రాణాలకు రక్షణ లేదు. ఇటువంటి చోట ఈ ప్రాంత ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పంటలు లేని కాలంలో వలసలు పోయి బతుకుతారు. పిల్లలు కూడా వారితోనే ప్రయాణిస్తుంటారు. చదువు లేక, భవిష్యత్తుపై ఏవిధమైన అవగాహన లేకుండానే ఎంతోమంది జీవితాలు గడిపేస్తారు. వీటన్నింటినీ చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన నేను 12వ తరగతి పూర్తి చేసి గ్రామానికి వచ్చాను. ఉన్నత చదువు చదవాలని ఉన్నా స్థోమత లేదు. ఈ లోపు లాక్‌డౌన్‌ పడింది.
ఒక పక్క ప్రజల ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు విద్యార్థులను చదువుకు దగ్గర చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మా ప్రాంత పిల్లలను చదువుకు దగ్గర చేయాలనుకున్నాను. దేశంలో చాలా ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ విద్య కొనసాగుతోంది. ఇక్కడ మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే గ్రామస్తుల్లో చాలామందికి ఫోన్లు లేవు. కొంతమందికి కీప్యాడ్‌ మొబైల్స్‌ ఉన్నాయి. ఒకరిద్దరి దగ్గర స్మార్ట్‌ ఫోను ఉన్నా, డేటా ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో ఆఫ్‌లైన్‌లో పిల్లలకు చదువు నేర్పాలనుకున్నాను.

2


కోవిడ్‌ సమయంలోనైతే చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగేవాడిని. ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు పంచేవాడిని. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఈ పిల్లలందరికీ ఏదైనా స్థిరనివాసంలో విద్య నేర్పించాలనుకున్నాను. అయితే అది అంత సులభం కాదు. ఒక గుడిసె కట్టాలన్నా నా ఒక్కడి వల్ల కాదు. అందుకే తల్లిదండ్రులను సంప్రదించాను. మొదట్లో వారు సుముఖత చూపించలేదు. 'మాకు బడి ఎందుకు.. చదువు ఎందుకు.. దండగ పనులు వద్దు.. అనేవారు. అయినా నేను పట్టు వదల్లేదు. తల్లిదండ్రులతో, పెద్దలతో పదే పదే మాట్లాడి, వారిలో ఒక నమ్మకం కలిగించాను. ఊరందరి సహకారంతో పాఠశాల కోసం ఒక పాక నిర్మించాం. రోజూ ఉదయాన్నే నిద్ర లేచి అడవి నుండి కలప తేవడంతో నా దినచర్య మొదలవుతుంది. తరువాత పొలం పని చేస్తాను. ఉన్న కాస్త పొలంలో కుటుంబ సభ్యులతో కలిసి వరి చేను సాగు చేస్తాను. స్కూలు సమయానికి పని పూర్తి చేసుకుని, గ్రామంలోని పిల్లలను కదలించి, బడికి తీసుకెళ్తాను. నాకు గ్రామస్తులు మాట్లాడే గోండీ భాష తెలుసు. అలాగే హిందీ కూడా వచ్చు. పిల్లలకు అక్షరాలు నేర్పిస్తాను. పాఠ్యపుస్తకాల్లోని కథలను, పాటలను పిల్లలకు అర్థమయ్యేలా బోధిస్తాను. పాటలు పాడిస్తాను. గోండీ భాషలోకి అనువదించి, అర్థాలు వివరిస్తాను. మొదట్లో స్కూలుకు పిల్లలు వచ్చేవారు కాదు. పిల్లలను స్కూలుకు రప్పించడం కోసం ఎన్నో కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనేవాడిని. కథలు, పాటలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చదువు అవసరాన్ని వివరించేవాడిని. కథలు, పాటలు వినిపిస్తే పిల్లలు ఆసక్తి చూపేవారు. బడికి వస్తే అలాంటివి ఇంకా బోలెడు నేర్చుకోవొచ్చని చెప్పేవాడిని. అలా ఆకర్షితులైన పిల్లలు ఇప్పుడు ఎంతో శ్రద్ధగా బడికి వస్తున్నారు. రాయడం, చదవడం నేర్చుకుంటున్నారు. వారు ఇంకా ఇంకా చదువుకోవడం ద్వారా ఊరు, వారి భవిష్యత్తు మారతాయని నేను నమ్ముతున్నాను.''
హుర్రా నమ్మకం తప్పక నెరవేరాలని మనమూ ఆశిద్దాం. అలాగే, ప్రభుత్వం పూనుకొని అక్కడ స్కూలును పున:నిర్మించి, ఆదివాసీ బాలల కు విద్యను అందించాల్సిన అవసరం ఉంది.

ఆ ఊళ్లో 2005 వరకు స్కూలు ఉండేది. సల్వాజుడుం కార్యకలాపాల్లో అది కూలిపోయింది. విద్యాబోధన ఆగిపోయింది. సుప్రీం కోర్టు 2011లో ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లో పాఠశాల నిర్మాణం ప్రారంభమైంది. కానీ, అది ఇప్పటికీ పూర్తి కాలేదు. గోడలు, పై కప్పు లేని స్తంభాల దశలోనే మిగిలి ఉంది. 15 ఏళ్లుగా అక్కడి పిల్లలకు చదువు అందకుండా పోయింది. అలాంటి పరిస్థితిలో హుర్రా 'చదువు చెప్పటానికి నేనున్నాను.' అని ముందుకొచ్చాడు. రోజూ గ్రామస్తులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తాడు. పంటలు లేని కాలంలో మార్కెట్లో దినసరి కూలీగా చేస్తాడు. ఇన్ని కష్టాల నడుమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నాడు. అతడి కృషి అభినందనీయం.