May 22,2023 07:50

వాడికి రెక్క లిచ్చావ్‌
చిట్టి పొట్ట కోసమో
బుజ్జి గూడు కోసమో..
ఎలాగూ ఎగురుతాడు

పర్వతపు శిఖరం దాకా ఎగరమనో
తనదైన జెండా ఒకటి
పాతేసుకోమనో
ఆ రెక్కలను ఎలాగూ నిమురుతావ్‌

దిశ అదొకటేనా
నిర్దేశించేది రెక్కలకు మాత్రమేనా..

కాలి గోళ్ళ కూ కాస్త నేర్పు..!

ఆడపిల్లల్ని తన్నుకుపోయి
గుచ్చి గుచ్చి గాయం చేసి
పొడిచి పొడిచి..ప్రాణం తీసేసేందుకా..
వాడికి గోళ్ళున్నది..?

కొమ్మలను కరుచుకునేందుకు కదా..!

నేర్పితే గీర్పితే..
కల్మషం లేకుండా కరగడం నేర్పు
అమానుషాలకు..ఆగడాలకు
ఆమడదూరముండేలా నేర్పు

తల్లిని చెలిని..అక్కను చెల్లిని
అక్కున చేర్చుకోవడం నేర్పు

ఆక్షేపణ..ఆరడి
కూల్చి..కాల్చే విద్వంసమూ..
జీవనాలలోకి చొరబడటం కాదు..!

ఆద్యంతం..
ఆడబిడ్డలకు తోడుగా ఎగర నివ్వడం నేర్పు !

వివక్ష లెరుగని
పిట్ట దొడ్డ మనసును
లోయలలో ఎగిరే..రెక్కల బలాన్ని
రహదారుల్లో సంచరించే..నిర్భీతిని
ఆడపిల్లల్లోకి ఒంపమని నేర్పు

అడ్డదిడ్డంగా ఎగిరితే
వాడి రెక్కలను తెగేసే అవకాశం
ఎప్పుడూ ఉందనే నేర్పు..!

- డా.దారల విజయ కుమారి
9177192275