Sep 13,2022 10:15

బిడ్డ కన్ను తెరిచే ఆసుపత్రి బెడ్‌ నుంచి... గుక్కపెట్టి ఏడ్చే చిన్నారికిచ్చే పాల చుక్క నుంచి.. చివరి మజిలీ శ్మశాన వాటిక వరకూ... కాదేదీ పన్నుకు అనర్హం అంటూ.. అన్నింటిపైనా మోడీ సర్కారు భారాలతో బాదేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో మూడు పూటలా అన్నం తినడమే కష్టంగా మారేలా ఉన్న పేదల బతుకులపై కేంద్రం తీసుకొచ్చిన జిఎస్‌టి విశ్వరూపం చూపిస్తోంది. రాయితీలు ఎత్తేయడంతో పెట్రోలు, గ్యాస్‌ ధరలు రంకెలేస్తున్నాయి. మధ్య తరగతి సైతం నలిగిపోతోంది. స్వాతంత్య్రానంతరం తొలిసారి నిత్యావసర వస్తువులపై మోడీ సర్కారు జిఎస్‌టి భారాలు మోపి, సామాన్యుడి కష్టాలు తనకు పట్టవని చాటిచెప్పింది. మరో వైపు కార్పొరేట్‌ కంపెనీలు చెల్లించే కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. దీంతో, ఏటా లక్షన్నర కోట్ల ఆదాయం తగ్గింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న కంపెనీలు ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల ఆదాయం పొందాయి. గత ఏడాది కంటే 70 శాతం అధిక లాభాలు గడించాయి. 2010-20లో సంపాదించిన సగటు లాభాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఆదాయమది. వారిపై ఎటువంటి పన్నులూ లేవు. గత ఎనిమిదేళ్ల మోడీ పాలనలో రూ.10,72,000 కోట్ల రుణాలు రద్దు చేశారు. బ్యాంకుల్లో తీసుకున్న రూ.4 లక్షల 50 వేల కోట్ల రుణాలను లక్షా 61 వేల కోట్లకు తగ్గించేసి, సెటిల్‌ చేసేశారు.

bheri


     నిత్యావసర వస్తువులైన బియ్యం, మొక్కజొన్న, అప్పడాలు, చేపలు, మాంసం పేక్‌డ్‌ ఉత్పత్తులపై ఐదు శాతం, గోధుమ పిండిపై ఎనిమిదిశాతం జిఎస్‌టి విధించింది. టెట్రా ప్యాక్‌లపై 12 నుంచి 18 శాతానికి పెంచింది. మరోవైపు ధనవంతులు కొనుగోలు చేసే డైమండ్స్‌పై 1.5 శాతం, బంగారంపై 3 శాతం పన్నుతో సరిపెట్టింది. యువతను పక్కదారిపట్టిస్తున్న ఆన్‌లైన్‌ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు, లాటరీలపై 28 శాతం పన్నులు వేయాలనే ప్రతిపాదనను కేంద్ర పాలకులు కనీసం పరిశీలించకుండా తిరస్కరించారు. విద్యకు ప్రాధాన్యత అంటూనే... పిల్లల చదువులకు అవసరమయ్యే ప్రింటింగ్‌, రైటింగ్‌, డ్రాయింగ్‌, ఇంక్‌లు, పెన్సిల్‌ చెక్కుకునే షార్ప్‌నర్లపై 18 శాతం, మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌లపై 12 శాతం బాదేసింది. రోడ్లు, వంతెనలు, రైల్వేలు, మెట్రో, శుద్ధి ప్లాంట్లు, శ్మశాన వాటికల కాంట్రాక్టు వర్కులపై 18 శాతం, చెక్కులు జారీ చేసినందుకు బ్యాంకులు వసూలు చేసే ఛార్జిపై 18 శాతం జిఎస్‌టి వేసేసింది. కేరళసహా పలు రాష్ట్రాలు ఈ బాదుడును వ్యతిరేకిస్తున్నా, కేంద్రం వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ జిఎస్‌టి, ద్రవ్యోల్బణం నేపథ్యంలో బియ్యం 25 కిలోల బస్తాపై ధర రూ.100 నుంచి రూ.300 వరకూ పెరిగిపోయింది. లీటర్‌ నూనె ధర రూ.100పైనే పెరిగిపోయింది.
     పెరుగు, లస్సీ, బటర్‌మిల్క్‌ వంటి ప్యాక్డ్‌ పాల ఉత్పత్తులపై కొత్తగా 5 శాతం జిఎస్‌టి విధించారు. ఈ ఉత్పత్తుల తయారీలో వినియోగించే యంత్రాలపై ప్రస్తుతం ఉన్న జిఎస్‌టిని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. తొమ్మిది కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ రంగంపై ప్రత్యక్షంగా ఆధారపడ్డాయి. 75 శాతం పాల ఉత్పత్తిదారులు రెండు నుంచి నాలుగు పాలిచ్చే పశువులు కలిగి ఉన్న వారే. వీరందరినీ ఈ రంగం నుంచి దూరం చేసి, కార్పొరేట్‌ రంగం గుప్పెట్లో డెయిరీ రంగాన్ని పెట్టేందుకే ఈ పన్నుల మోత మోగించారని, పిల్లలకు పౌష్టికాహారమైన పాలు కూడా అందకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ఇంటిని నెట్టుకొచ్చే సామాన్యులతోపాటు చిన్న చిన్న హోటళ్లు, తినుబండారాలు వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
 

రాష్ట్రంలో ఆర్‌టిసి, విద్యుత్‌ ఛార్జీల మోత
ఇక రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా భారాల మోతలో తన వంతుపాత్ర పోషిస్తోంది. డీజిల్‌ ఛార్జీల మోత నేపథ్యంలో మూడేళ్లలో మూడుసార్లు ఆర్‌టిసి ఛార్జీలు పెంచేసింది. దీంతో, ప్రయాణికులపై సుమారు రూ.2 వేల కోట్ల భారం ఏటా పడుతోంది. ఇప్పటికే రూ.1400 కోట్ల మేర విద్యుత్‌ ఛార్జీలను పెంచింది.ఆ తరువాత ట్రూఅప్‌ పేరుతో రూ.2,900 కోట్లు వసూలు చేస్తోంది.2022 జనవరి నుండి మార్చి మూడు నెలల ట్రూఅప్‌ ఛార్జీలుగా రూ.1048 కోట్ల వసూలుకు ఎపిఇఆర్‌సి ్ద ప్రతిపాదించింది
 

ఉరుముతున్న ద్రవ్యోల్బణం
వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచి ఆగస్టులో ఏడు శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎనిమిదేళ్లలోనే గరిష్టంగా 7.79 శాతానికి చేరింది. దీంతో, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం సామాన్యుడికి కష్టంగా మారుతోంది.


రెండేళ్లలో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.561 అదనపు భారం...
మోడీ సర్కారు ఈ రెండేళ్లలోనే ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.561 పెంచింది. అంటే 75 శాతం పెంపుదల ఉంది. ఏడాదికి 8 సిలిండర్లు వాడే ఒక సామాన్య కుటుంబంపై ప్రతి సిలిండర్‌కు రూ.561 చొప్పున ఏడాదిలో రూ.4,488 అదనపు భారం పడింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధరలు ఉండటంతో, లీటరు పెట్రోలు రూ.74.71కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం అంతకంటే తక్కువ ధరలే ఉన్నా, ఇప్పుడు మన రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.111.51, డీజిల్‌ ధర రూ.100.13గా ఉంది. 2021 ఏప్రిల్‌లో పెట్రోలు రూ.90.40, డీజిల్‌ రూ.80.73 ఉండేవి. అంటే ఏడాదిలోనే 20 రూపాయలకుపైగా పెరిగాయి.

పి. త్రిమూర్తులు