
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ఎంతో అర్బాటంగా ప్రకటించిన మహిళల పొదుపు పథకంపైనా వడ్డీ బాదాలని నిర్ణయించింది. మహిళల కోసం ఉద్దేశించిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌లో వచ్చే వడ్డీపైనా పన్ను చెల్లించాల్సిందేనని సిబిడిటి స్పష్టం చేసింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవాలని భావించే మహిళలకు ఇది మంచి స్కీమ్ అని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో పొదుపు చేసిన వారికి పన్ను లాభాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చేసిన ప్రకటనతో చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవాలని భావించిన పేద, మధ్య తరగతి మహిళలకు షాక్ ఇచ్చినట్లయ్యింది. దీని వల్ల పొదుపుపై మహిళల ఆశలు సన్నగిల్లినట్లయ్యింది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎ కింద మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌పై వచ్చే వడ్డీ మొత్తంపై టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుందని సిబిడిటి స్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సమ్మాన్ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూపంలో రూ.40,000 పైన రాబడి ఉంటే అప్పుడు సెక్షన్ 194ఎ కింద టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పోస్టాఫీసు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం కూడా ఈ సెక్షన్ పరిధి కిందకే వస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50,000 ఉంటుంది. పరిమిత కాలం వరకే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో చేరిన వారికి 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేసుకోవడానికి వీలుంది. ఈ పథకంలో వచ్చే ఏడాది చివరి వరకు చేరవచ్చు. ఇప్పటికే అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ తగ్గించింది. ఎంతో ఆశగా మహిళా సమ్మాన్‌లో చేరి పొదుపు చేసుకున్న వారికి తాజా షరతు ఆందోళన కలిగిస్తోంది.