Nov 08,2023 10:58

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పన్నుల్లో పంపిణీ వాటా కింద నవంబరు నెలకు గానూ ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,952.74 కోట్లు కేంద్రం విడుదల చేసింది. సాధారణంగా ప్రతినెలా 10న ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈసారి మూడు రోజుల ముందుగానే పన్నుల్లో పంపిణీ వాటాలను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు వెల్లడించింది. పండగ సమయంలో ముందస్తు నిధుల విడుదల రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తోందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎపి, తెలంగాణతోపాటు దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.72,961.21 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.1,533.64 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా యుపికి రూ.13,088.51 కోట్లు విడుదల చేసింది. తరువాత స్థానంలో బీహార్‌ (రూ.7,338.44 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ.5,727.44 కోట్లు), పశ్చిమబెంగాల్‌ (రూ.5,488.88 కోట్లు), రాజస్థాన్‌ (రూ.4,396.64 కోట్లు), కర్ణాటక (రూ.2,660.88 కోట్లు), గుజరాత్‌ (రూ.2,537. 59 కోట్లు), ఝార్ఖండ్‌ (రూ.2,412.83) కోట్లు విడుదల చేసింది.