Aug 30,2023 11:57

ట్యాక్సుల్లో నేతల ట్యాక్స్‌ వేరు..!
 నిర్మాణం జరిగితే ముట్టజెప్పాల్సిందే..
లేకుంటే నిర్మాణాలు ఆగాల్సిందే

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సాధారణంగా ఏమైనా నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వానికిగానీ, స్థానిక సంస్థలకుగానీ ట్యాక్సు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతపురం నగరంలో మాత్రం నేతల ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. ఏ భవన నిర్మాణం జరిగినా ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్సులు చెల్లించినప్పటికీ స్థానిక నేతల ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోంది. వారి వారి స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నగర పాలక సంస్థ పరిధిలోనున్న అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు ఇదే పని మీద ఉన్నట్టు ఆరోపణలున్నాయి. నిర్మాణం చేపట్టేది అధికారపార్టీకి సంబంధించిన వారైనా సరే తమ ట్యాక్సు మాత్రం కట్టాల్సిందే. లేకపోతే మధ్యలోనే నిర్మాణాలు ఆపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలన్నా పైసలివ్వాల్సిందే...
అనంతపురం నగరంలోని సాయినగర్‌ నర్సింగ్‌ హోం నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక నేతల నుంచి ఇబ్బందులు తప్పలేదు. నిర్మాణం కోసం బోరు వేసే సమయంలోనే నేతలు అక్కడికి చేరుకున్నారు. తమ ట్యాక్సు కట్టకుండా బోరు ఏ రకంగా వేస్తారంటూ అడ్డుకున్నారు. చివరకు చేసేది లేక కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు. ఇక తాజాగా అదే భవనానికి సంబంధించి విద్యుత్‌ సరఫరా కోసం కొత్త ట్రాన్స్‌ఫార్మన్‌ ఏర్పాటు కోసం పనులు చేపట్టారు. రోడ్డు పక్కన ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టినందుకు కూడా తనకు ట్యాక్సు కట్టాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఇలా ప్రతి అంశంలోనూ డబ్బులు ఇవ్వాల్సి రావడం పట్ల నర్సింగ్‌ హోం యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. సమస్యను ముఖ్య నాయకుడి వరకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై నిఘా వర్గాలు సైతం వివరాలు సేకరించే పనిలోపడ్డాయి. ఇలా నగరంలో అనేక చోట్ల నేతల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇక పెద్ద భవనాలకైతే లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తోంది.
అభివృద్ధి పని అయినా అంతే..
ఇక అభివృద్ధి పనులకు సైతం పర్సంటేజీలు ఇచ్చుకోవాలి. లేకుంటే తమ డివిజన్‌ పరిధిలో అయినా పని చేయడానికి వీల్లేదు. విద్యుత్‌నగర్‌ సర్కిల్‌ నుంచి జెఎన్‌టియుకు వెళ్లే దారిలో పర్సంటేజీలివ్వలేదని గతంలో బాహాటంగానే కాంట్రాక్టరుతో గొవడ పడిన ఘటనలూ ఉన్నాయి. వారికి ముందుగా పది శాతమైనా చెల్లించాలి. అదేమంటే 'తాము ఎన్నికల్లో లక్షల్ల ఖర్చు పెట్టుకున్నాం. ఇక దాన్ని రికవరీ చేసుకోవాల్సిందే కదా' అని బాహాటంగానే చెబుతుండటం గమనార్హం. ఇలా ప్రతి పనికీ ఎంతో కొంత ముట్టజెప్పనిదే ముందుకు కదలదు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే వీరు చేసే పని మాత్రం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. సొంత పని జరగాలన్నా, అభివృద్ధి పనులు జరగాలన్నా వీరి అనుమతులు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.