
ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం) : విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అదృశ్యమయ్యారు. ఆ ప్రాంతంలోని వార్డు వలంటీరే తన భార్యను తీసుకెళ్లినట్లు ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రేవల్లపాలెం గ్రామానికి చెందిన పి.వరలక్ష్మి గతంలో జివిఎంసి ఏడో వార్డు పరిధిలోని మిథిలాపురి వుడా కాలనీ సచివాలయంలో వలంటీరుగా విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆమె పనిచేయడం లేదు. గత నెల 27 నుంచి ఆమె కనిపించకపోవడం లేదు. గతంలో ఆమె విధులు నిర్వర్తించిన సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తున్న దిలీప్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దిలీప్ కూడా కనిపించడం లేదని ఫిర్యాదుదారు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.