Sep 24,2023 06:47

సింగారం అనే గ్రామంలో సిరి, ఇందు మంచి స్నేహితులు ఉన్నారు. సిరి బాగా చదివేది. ఇందు కూడా తెలివైనదే కానీ, చదువుపై అంతగా శ్రద్ధ పెట్టేది కాదు. బాగా బద్ధకం. ప్రతిదానికీ సిరిపైనే ఆధారపడుతుంది.
'పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. చదువుకోవచ్చు కదా?' అని సిరి చెబితే వినేది కాదు. 'నువ్వు ఉన్నావ్‌ కదా! నీ దాంట్లో చూసి రాస్తాను లే' అని నవ్వుతూ బదులిచ్చింది ఇందు. 'ఎంత చెప్పినా వినదు. దాని మంకు దానిదే' అని మనసులోనే అనుకుంది సిరి.
పరీక్ష రోజు రానే వచ్చింది. జ్వరంగా ఉండటం వల్ల సిరి రెండు రోజులు పాఠశాలకు హాజరు కాలేదు. ఇందు చాలా బాధపడింది. 'అయ్యో సిరి ఉంది కదా అని నేను సరిగ్గా చదవలేదు. ఇప్పుడు నాకు తెలియని ప్రశ్నలు ఎవరు చెబుతారు? అనుకుంటూ బడికి బయలుదేరింది.
పరీక్షలు రాసింది కానీ మార్కులు తక్కువ వస్తాయని భయపడింది. మరుసటి రోజు కూడా సిరి పరీక్షకు హాజరు కాదని తెలిసి ఆ సాయంత్రం ఇంటికి వెళ్లగానే పుస్తకాలు తీసి శ్రద్ధగా చదివింది. మరుసటిరోజు పరీక్షకు సంతోషంగా బయలుదేరింది ఇందు. ఆ రోజు సిరి కూడా పరీక్షకు వచ్చింది. కానీ సిరిని ఏమీ అడక్కుండానే సొంతగా రాసింది.
పరీక్ష ముగిసిన తర్వాత 'ఏంటి ఇందు. పరీక్ష ఎలా రాసావు? ఒక్కసారి కూడా నన్ను అడగలేదు' అని అడిగింది సిరి.
'నువ్వు రావు అనుకొని నిన్న బాగా చదివాను. అన్నీ గుర్తున్నాయి. పరీక్ష కూడా బాగా రాశాను. చాలా సంతోషంగా ఉంది' అని బదులిచ్చింది ఇందు.
'చూసావా ఇందు. ఈరోజు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో! నీకు చదువు బాగా వచ్చు. కానీ నేను చూపిస్తాను అని ఇన్ని రోజులు చదవడమే మానేసావు' అన్నది సిరి.
'అవును సొంతంగా చదివి రాస్తే వచ్చే ఆనందమే వేరు. ఇక నుండి కష్టపడి చదివి రాస్తాను.' అన్నది ఇందు. తన స్నేహితురాలిలో మార్పు వచ్చినందుకు సిరి చాలా సంతోషించింది.

- మొర్రిమేకల నాగేశ్వరి
7వ తరగతి, జెడ్‌పిహెచ్‌ మేళ్ళ చెరువు,
సూర్యాపేట జిల్లా.