Jul 14,2023 08:15

నక్క నిదురపోతున్నది
నిదురలోన కల కన్నది
చుట్టుపక్క జంతువుల
ఈసడింపు కలను వింది !.

టక్కరి నక్క అంది కుందేలొకటి
వంచించే నక్క అని నెమలి అన్నది
దొంగబుద్ధి కలది అని కాకి అన్నది
ఆ మాటలు విన్న నక్క మేలుకున్నది!

జంతువులన్నీ నన్ను
చులకననగా చూస్తున్నవి
పక్షులు కూడా నన్ను
గేలి చేయుచున్నవి

ఇకపై నే మారాలని
నిర్ణయము తీసుకుని
కొలనులోన స్నానమాడి
ముఖాన విభూది పెట్టి.

మెడను మాల ధరించింది
మంత్రమేమో జపించింది
మౌనముగా దీక్ష బూని
ఒక్కచోట కూర్చున్నది

నక్క దీక్ష కాంచినవి
మరో నటన అనుకున్నవి
జంతువులన్నీ చేరి
దొంగ దీక్ష చాలన్నవి !

నేనోమో మారానంటే
చూడరు మీరెవ్వరు
మంచితనం గుర్తించరు
మాటేమో నమ్మరు !

నను నమ్మని మీ కోసం
నేనెందుకు మారాలని
దగ్గరకొచ్చిన గువ్వను
చప్పున నోటను బట్టెను

చూశారా, నక్క మార్పు
ఒక్క రోజు ఆగలేదు
ఎవరో అంటే మాత్రం
దొంగ బుద్ధి దాగలేదు.

నక్క ఎప్పుడూ నక్కె
టక్కరిలో మార్పు రాదు
నటనలోన నేర్పరి
నమ్మేమా, పని సరి !
 

- కూచిమంచి నాగేంద్ర,
91821 27880.