Jul 28,2023 23:01
  • ఇద్దరు అధికారులకు హైకోర్టు నోటీసులు
  • కోర్టు సూచనలిస్తే పాటిస్తాం : మంత్రి బొత్స

అమరావతి : రాజకీయ సభలకు విద్యార్థుల తరలింపు చట్టవిరుద్ధమని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులను రాజకీయ సభలకు తరలించటంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఆదివాసి గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు చొక్కారావు హైకోర్టులో దాఖలు చేశారు. విద్యార్థులను రాజకీయ సమావేశాలకు తరలించరాదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం ఎపి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌, హోంశాఖ కార్యదర్శి హరీశ్‌ గుప్తాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమ్మ ఒడి సభకు విద్యార్థులు, తల్లిదండ్రులు రావడం తప్పుకాదని అన్నారు. లేదంటే ఇలాంటి కార్యక్రమాలకు సినీ నటులు వస్తారా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై కోర్టు సూచనలిస్తే పాటిస్తామని తెలిపారు.