Jul 20,2023 06:50

సిరిపురంలో చంద్రయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. అతనికి కొంత అత్యాశ ఉండేది. ఒకసారి నలభై కిలోల బీరకాయలు, పలు రకాల కూరగాయలు తీసుకుని సంతలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సాయంత్ర మయ్యేసరికి కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. బీరకాయలు మాత్రం అలాగే ఉండి పోయాయి. చీకటి పడుతున్నా ఎవరూ కొనడం లేదు. ఇంతలో ఓ వ్యక్తి చంద్రయ్య దగ్గరకు వచ్చి 'కిలో బీరకాయలు ఎంత? ఈ బస్తాలో మొత్తం ఎన్ని కిలోలు ఉన్నాయి' అన్నాడు. కిలో రూ.30. ఈ బస్తాలో మొత్తం 50 కిలోల బీరకాయలు ఉన్నాయి.' అన్నాడు చంద్రయ్య. అప్పటికే పూర్తిగా చీకటి కమ్మేసింది. 'సరే బీరకాయల బస్తా నా బండిలో పెట్టు' అని మూడు రూ.500 నోట్లు చంద్రయ్యకు అందించాడు ఆ వ్యక్తి. ఆ నోట్లను అందుకుని బీరకాయల బస్తాను బండిలో వేసి పంపించాడు చంద్రయ్య. 'బీరకాయలు అమ్ముడుపోక నిరాశగా ఉన్న నాకు చివరలో భలే బేరం వచ్చింది..' అనుకుంటూ ఇల్లు చేరాడు. ఇంటికి వచ్చాక ఆ రోజు వచ్చిన డబ్బును లెక్క చూసుకుం టుంటే అందులో బీరకాయలు కొన్న వ్యక్తి ఇచ్చిన నోట్లలో ఒకటి నకిలీదీ అని అర్థమైంది. '40 కిలోల బీరకాయలను 50 కిలోలుగా అబద్దమాడి అమ్మినం దుకు తగిన శాస్తి జరిగింది, తనను మోసగించ బోయి నేనే మోసపోయాను... అనుకున్నాడు. ఇంకెవరినీ ఎప్పుడూ మోసగించరాదని నిర్ణయించుకుంటాడు.

- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.