Nov 03,2022 22:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న అయ్యన్నపాత్రుడి కుటుంబంపై జగన్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిడిపి నేతలు విమర్శించారు. అయ్యన్నపాత్రుడు రాజేష్‌ల అరెస్టులను వేరు వేరు ప్రకటనల్లో ఖండించారు. ఇది బిసిలపై జరిగిన దాడి అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ హింస విధానంపై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా టిడిపి నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో వైసిపి నాయకుల దోపిడి, భూకబ్జాలు, దౌర్జాన్యాలను బయటపెడుతున్నందుకే అయ్యన్నపాత్రుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. తప్పుడు కేసులతో వేధిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. విజయసాయిరెడ్డి భూదందాపై పోరాటం సాగిస్తున్నందుకే అయ్యన్నపై కక్షసాధింపు అని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అయ్యన్నపాత్రుడు అరెస్టును ఆ పార్టీ నేతలు నక్కా ఆనంద్‌ బాబు, బండా ఉమామహేశ్వరరావు,పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్‌, డోలా బాలా వీరాంజనేయ స్వామి,ధూళ్లిపాళ్ల నరేంద్ర,కెఎస్‌ జవహర్‌, ఆలపాటి రాజా, మద్దిపాటి వెంకటరాజు, డూండీ రాకేష్‌, శ్రీరామ్‌ చినబాబు,కావాలి గ్రీష్మ తదితరులు ఖండించారు.
బిసి కార్డుతో వెనుకేసుకురావడం తగదు: మంత్రులు బూడి, జోగి
అధికారంలో వున్నపుడు అయ్యన్నపాత్రుడు చేసిన అక్రమాలలో అడ్డంగా దొరికిపోయినా తెలుగుదేశంపార్టీ బిసి కార్డుతో వెనుకేసుకువస్తూ రాజకీయం చేయడం తగదని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. గురువారంనాడు తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్రకార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మాజి మంత్రి అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. తప్పుతేలాక అరెస్ట్‌ చేయకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. పంటకాల్వల కబ్జాను వెనుకేసుకురావడం సరైందికాదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఇందులో రాజకీయ కక్ష ఎక్కడ వుందో చెప్పాలని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బిసిలకు జరిగిన నష్టమేమిటి, సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని తెలుగుదేశంనేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు, వారి కుటుంబం తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో తెలుగుదేశం నేతలకు ప్రత్యేక చట్టాలు ఏమి లేవన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు తమనాయకులు చేసిన తప్పులను వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. తప్పచేసిన వారు ఎంతటివారినైనా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు.