Nov 17,2023 21:36

-టికెట్లు దక్కించుకునేందుకు స్టేడియం వద్దే నిద్ర
ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం):విశాఖ వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా టి-20 మ్యాచ్‌ ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయం శుక్రవారం ప్రారంభమైంది. టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. త్వరితగతిన టికెట్లు దక్కించుకునేందుకు కొందరు యువకులు గురువారం రాత్రి స్టేడియం వద్దే నిద్రపోయారు. మహిళలు సైతం శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్లలో పోటీపడ్డారు.
పురుషులు, మహిళల కోసం పిఎం.పాలెంలోని క్రికెట్‌ స్టేడియం 'బి' గ్రౌండ్‌, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాకలోని రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించారు. రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000 విలువ గల టికెట్లను అందుబాటులో ఉంచారు. పిఎం.పాలెంలోని క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయ కేంద్రాలను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఆఫ్‌లైన్‌లో రోజుకు ఐదు వేల టికెట్ల చొప్పున విక్రయించేలా ఏర్పాటు చేశామన్నారు. శనివారం కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇందిర ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఈ నెల 22వ తేదీ వరకు, పిఎం.పాలెంలో ఉన్న ఎసిఎ - విడిసిఎ స్టేడియం 'బి' గ్రౌండ్‌ కౌంటర్‌లో 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చని తెలిపారు.