యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఓ సంచలనం నమోదైంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 11వ సీడ్ క్విటోవా, 12వ సీడ్ క్రేజికోవా రెండోరౌండ్‌ను దాటలేకపోయారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్ పోటీలో క్విటోవా 5-7, 6-7(5-7)తో మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణి వోజ్నియాకీ(డెన్మార్క్) చేతిలో, క్రేజికోవా 4-6, 6-7(3-7)తో అన్‌సీడెడ్ బ్రోంజెట్టి(ఇటలీ) చేతిలో వరుససెట్లలో ఓడారు. మరో పోటీలో 18వ సీడ్ అజరెంకా(రష్యా) 3-6, 3-6తో జూ(చైనా) చేతిలో, 24వ సీడ్ లినెట్టె(పోలండ్) 1-6, 6-2, 2-6తో బ్రాడీ(అమెరికా) చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 4వ సీడ్ రైబకినా(కజకిస్తాన్)కు రెండోరౌండ్‌లో వాకోవర్ లభించగా.. 20వ సీడ్ ఓస్టాపెంకో 6-3, 5-7, 7-5తో అన్‌సీడెడ్ అవనిస్యేన్(రష్యా) చేతిలో పోరాడి ఓడింది. ఇక టాప్‌సీడ్ ఇగా స్వైటెక్(పోలండ్) 6-3, 6-4తో సవెల్లి(ఆస్ట్రేలియా)పై, 10వ సీడ్ ముఛోవా(చెక్) 6-3, 6-3తో ఫ్రెంచ్(పోలండ్)పై నెగ్గి మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లారు. ఇక అమెరికా యువ క్రీడాకారిణి 6వ సీడ్ కోకా గాఫ్ 6-3, 6-2తో ఆండ్రీవా(రష్యా)పై నెగ్గి దూసుకెళ్తోంది.
రూఢ్, సిట్సిపాస్‌కు షాక్..
పురుషుల సింగిల్స్‌లోనూ సంచలనాలు నమోదయ్యాయి. 7వ సీడ్ గ్రీక్‌కు చెందిన సిట్సిపాస్, 7వ సీడ్ రూఢ్(నార్వే) అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. రూఢ్ 4-6, 7-5, 2-6, 6-0, 2-6తో జంగ్(చైనా) చేతిలో, సిట్సిపాస్ 5-7, 7-6(7-2), 7-6(7-5), 6-7(6-8), 3-6తో స్ట్రిక్కర్(స్విట్జర్లాండ్) చేతిలో ఐదుసెట్ల హోరాహోరీ పోరులో ఓడారు. ఇతర పోటీల్లో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ 6-4, 6-1, 6-1తో జపట్టా(స్పెయిన్)పై, 10వ సీడ్ టఫీ 6-3, 6-1, 6-4తో ఓఫ్నర్(ఆస్ట్రియా)పై గెలిచి మూడోరౌండ్‌కు చేరారు.










