Aug 05,2023 14:45
  • బందరు కోటలో తీవ్ర విషాద ఛాయలు
  • కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : మచిలీపట్నం, బందరు కోటకు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలతో బెంగుళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి  చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బందరు కోటకు చెందిన గుండు వీరార్జున వినరు (కన్నా) బెంగుళూరులో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తూ, 3 నెలలుగా భార్య హైమావతి, ఇద్దరు కుమార్తెలతో బెంగుళూరులో నివాసము ఉంటున్నారు. కాగా రెండు రోజులుగా ఫోన్‌ చేసినా ఎలాంటి స్పందన రాకపోవటంతో అనుమానం వచ్చిన హైమావతి తల్లిదండ్రులు బెంగుళూరు చేరుకున్నారు. ఇంట్లో విగతజీవులుగా పడివున్న నలుగురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. భార్యాభర్తలు పిల్లలతో కలిసి బలవన్మణానికి పాల్పడ్డారా లేక భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా భార్యను, పిల్లలను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కుటుంబ సభ్యులు నాలుగు మృతదేహాలను శనివారం బెంగుళూరు నుండి ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం తీసుకు వచ్చారు. ఒక్కసారి నాలుగు మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో బందరు కోటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బెంగుళూరులో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.