Oct 28,2023 09:53

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్‌ కళాశాల (కెఎల్‌యు) క్యాంటీన్‌లో పనిచేసే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... గుండిమెడకు చెందిన శృతి (18) గ్రామానికి సమీపంలో ఉన్న కెఎల్‌యు క్యాంటీన్‌లో పనికి వెళ్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఇంటి నుండి క్యాంటీన్‌లో పనికి వెళ్లిన శృతి రాత్రైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కెఎల్‌ యూనివర్సిటీకి వెళ్లి ఆరా తీశారు. విధులు ముగిసిన వెంటనే శృతి వెళ్లిపోయిందని క్యాంటిన్‌ సిబ్బంది చెప్పడంతో వారు ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం కెఎల్‌ యూనివర్సిటీ సిబ్బంది ఫోన్‌ చేసి శృతికి బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే సరికి ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు అరుణ్‌ కుమార్‌, దుర్గ బోరున విలపించారు. వర్సిటీ భవనం 6వ అంతస్తు నుండి దూకినట్లు సిబ్బంది చెప్పారని వాపోయారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, శృతి మృతి విషయాన్ని కెఎల్‌యు యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.