Sep 07,2023 20:16

ప్రజాశక్తి-కడప :కడప రైల్వేస్టేషన్‌ సమీపంలోని భాకరాపేట వద్ద మంగళవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనకు సంబంధించి కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ డి.నరసింహారెడ్డితో సహా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌రెడ్డి, డిప్యూటీ స్టేషన్‌ సూపరింటెండెంట్‌ లాల్‌బాబుసింగ్‌, సీనియర్‌ జిటిఎం ఖాసీం, పాయింట్స్‌మెన్‌ జ్యోతి ప్రతాప్‌, పాయింట్స్‌ ఉమెన్‌ శాంతిని బుధవారం సస్పెండ్‌ చేసి అదేరోజు రాత్రి వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భాకరాపేట వద్ద చోటు చేసుకున్న ఘటనపై విచారణ నిమిత్తం కమిటీ వేసినట్లు తెలుస్తోంది. కమిటీ విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • పట్టాలు తప్పిన ప్రాంతాన్ని పరిశీలించిన డిఆర్‌ఎం

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ప్రాంతాన్ని, గూడ్స్‌ బ్రేక్‌ వ్యాన్‌, డెమో ప్రాంతాలను గురువారం గుంతకల్‌ డిఆర్‌ఎం మనీష్‌ అగర్వాల్‌ సందర్శించారు. సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ విద్యుత్‌ కార్యాలయాన్ని, అధికారుల విశ్రాంతి గృహాన్ని, రైల్వే గూడ్స్‌ ఆఫీసును ఆయన తనిఖీ చేశారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట సీనియర్‌ డిఒఎం జి.శ్రావణ్‌ కుమార్‌, సీనియర్‌ డిఇఎన్‌(కోాఆర్డినేషన్‌) అక్కిరెడ్డి, సీనియర్‌ డిఇఎన్‌ (సౌత్‌) అభిరామ్‌, ఎడిఇ ఎన్‌.రాధాకృష్ణ, ఎఎస్‌టిఇ కాత్య కుమార్‌, ఎస్‌ఎంఆర్‌డి ఎన్‌రెడ్డి, సిసిఐ ఎ.జనార్ధన్‌, సీనియర్‌ డిఎస్‌టిఇ వై.పి.సింగ్‌ ఉన్నారు.