- శ్రీకాకుళం జిల్లాలో రూ.3.23 కోట్ల అక్రమాలు గుర్తింపు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్‌్, శ్రీకాకుళం అసిస్టెంట్ డైరెక్టర్ సహా పలువురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీలో గ్రేడ్-2 సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్న సువ్వారి చిన్నికృష్ణ గతంలో ఇచ్ఛాపురం, ఎచ్చెర్లలో పనిచేస్తున్న సమయంలో రూ.3,22,57,819 దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జిఒ జారీ చేసింది. నిధుల దుర్వినియోగాన్ని గుర్తించడంలో విశాఖ మార్కెటింగ్‌శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.ఎర్రన్న, శ్రీకాకుళం సహాయక సంచాలకులు బి.శ్రీనివాసరావు విఫలమయ్యారని వారిని సస్పెండ్ చేసింది. శ్రీకాకుళం సహాయక సంచాలకులుగా పనిచేసిన బి.శ్రీనివాసరావు ప్రస్తుతం పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎఎంసి) స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగంలో నరసన్నపేట, కోటబొమ్మాళి ఎఎంసి సూపర్ వైజర్లు కె.రామారావు, కె.మురళీకృష్ణ, ఎచ్చెర్ల ఎఎంసి వాచ్‌మెన్ కె.ఉమామహేశ్వరరావు భాగస్వామ్యం ఉందని, వారిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.










