Aug 17,2023 08:13
  • మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఫలితం

చండీఘర్‌ : లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ హర్యానా మంత్రి సందీప్‌ సింగ్‌పై ఆరోపణలు చేసిన మహిళా జూనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆమెను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ డైరెక్టర్‌ యషేంద్ర సింగ్‌ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేశారు. పంచకుల జిల్లా క్రీడా అధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ అథ్లెటిక్‌ కోచ్‌ను సస్పెండ్‌ చేశామని, ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వులలో వివరించారు. అయితే సస్పెన్షన్‌కు కారణాలను అందులో తెలియజేయలేదు. వెంబడించడం, అక్రమంగా నిర్బంధించడం, లైంగిక వేధింపులు, భయపెట్టడం వంటి ఆరోపణలకు సంబంధించి సందీప్‌ సింగ్‌పై గత సంవత్సరం డిసెంబర్‌లో కోచ్‌ ఫిర్యాదు చేశారు. తన సస్పెన్షన్‌పై మహిళా కోచ్‌ స్పందిస్తూ 'అవును. నన్ను సస్పెండ్‌ చేశారు. కేసును ఉపసంహరించుకొని రాజీ చేసుకోవాలని నాపై బాగా ఒత్తిడి వచ్చింది. నన్ను ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పలేదు. ఈ చర్యను ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. నాపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రభుత్వం మరోసారి ఈ ప్రయత్నం చేసింది. కానీ నేను తలవంచను' అని స్పష్టం చేశారు.