న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఉద్యమాలు జరిపే ప్రగతిశీల హిందువుల ఉద్యమానికి, వారి మద్దతుదారులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడుతోందని హిందూస్ ఫర్ హ్యూమన్‌రైట్స్ (హెచ్‌ఎఫ్‌హెచ్‌ఆర్) పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత్‌లో హెచ్‌ఎఫ్‌హెచ్‌ఆర్‌కు సంబంధించిన ఎక్స్ ఖాతాను, వారి భాగస్వామి ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఎఎంసి) ఖాతాను శనివారం నుంచి విత్‌హెల్డ్‌లో పెట్టారు. మోడీ ప్రభుత్వం నుండి వచ్చిన లీగల్ డిమాండ్ మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా కేంద్రంగా ఈ రెండు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వాస్తవాలు మాట్లాడడం, న్యాయం కోసం నిరంతరంగా పట్టుబట్టడమనేది బిజెపి ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని హెచ్‌ఎఫ్‌హెచ్‌ఆర్ హెచ్చరించింది. విదేశాల్లో ఆసక్తి గల భాగస్వాముల సాయంతో మోడీ ప్రభుత్వం ఇతర దేశాల్లో కూడా అణచివేత చర్యలు చేపట్టగల సమన్వయ ప్రణాళికను కలిగివుందని ఈ చర్యతో స్పష్టమైందని ఆ ప్రకటనలో పేర్కొంది. 2024 ఎన్నికలకు ముందు భారత్‌లో మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేవారి వాణిని అణచివేసేందుకు ఈ చర్యలు ఉద్దేశించబడ్డాయని పేర్కొంది. హిందూత్వపై తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మోడీ నిరంకుశ ప్రభుత్వంతో కుమ్మక్కై ఎలన్ మస్క్ పనిచేస్తున్నారని దీంతో స్పష్టమైందని ఐఎఎంసి మరో ప్రకటనలో పేర్కొంది.










