- ఓట్ల అక్రమ తొలగింపులో బిఎల్‌ఒలపై ఒత్తిడి తేవడమే కారణం
-చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు
ప్రజాశక్తి- బాపట్ల జిల్లా:ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారాం7 దరఖాస్తుల సమాచారాన్ని తీసుకోవడమే కాకుండా బిఎల్‌ఒలపై ఓట్ల తొలగింపు కోసం ఒత్తిడి చేశారనే ఆరోపణలపై మార్టూరు సిఐ టి.ఫిరోజ్, పర్చూరు ఎస్‌ఐ ఎన్‌సి.ప్రసాద్, మార్టూరు ఎస్‌ఐ కె.కమలాకర్, గతంలో యద్దనపూడి ఎస్‌ఐగా పనిచేసిన కె.అనూక్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు రేంజి ఐజి పాలరాజు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్ జిందాల్ ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో గత జులై నుంచి ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పర్చూరులో 40 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, గ్రామాల వారీగా ఉన్న దొంగ ఓట్లను తాము గుర్తించామని అధికార వైసిపి నేతలు అప్పట్లో ప్రకటించారు. వాటిని తొలగించేందుకు గ్రామాలలోని వైసిపి అనుయాయులతో ఫారాం7 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. దీంతో, దొంగ ఓట్ల పేరుతో పర్చూరులో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు వైసిపి వారు కుట్ర చేస్తున్నారంటూ పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పర్చూరులో ఓటర్ల జాబితా తయారీలో మహిళా పోలీసులను బిఎల్‌ఒలుగా నియమించారు. వారితో పోలీస్ అధికారులు మార్టూరు, యద్దనపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ గ్రూప్‌లను ఏర్పాటు చేసి, ఫారం 7 ద్వారా దాఖలైన దరఖాస్తుల విషయంలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీస్ అధికారులు బిఎల్‌ఒలతో జరిపిన వాట్సాప్ చాట్‌లను సేకరించిన ఎమ్మెల్యే వాటి స్క్రీన్ షాట్లతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పర్చూరు నియోజకవర్గంలో 189 మంది 14 వేల ఓట్ల తొలగింపునకు అక్రమ మార్గంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు, వాటిపై బిఎల్‌ఒలు తీసుకోవలసిన చర్యల గురించి సిఐ, ఎస్‌ఐలు బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉన్న వారితో వాట్సాప్ చాట్ ద్వారా ఆదేశాలు ఇచ్చినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దీనిపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా విచారణ చేయించారు. మార్టూరు సిఐ, ముగ్గురు ఎస్‌ఐలకు బిఎల్‌ఒలు ఫారాం7ల సమాచారం పంపినట్లు తేలడంతో ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపారు. ఈ అంశం ఎన్నికల కమిషన్‌తోపాటు కోర్టు పరిధిలో కూడా ఉన్న నేపథ్యంలో సదరు పోలీస్ అధికారులను తొలుత ఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్‌తోపాటు కోర్టులో సమాధానం చెప్పుకోవడం కష్టమని భావించిన పోలీస్ ఉన్నతాధికారులు ఆ నలుగురినీ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పర్చూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రానైట్, గ్రావెల్ తరలింపుల విషయంలో కూడా ఈ నలుగురిపై పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది.










