Oct 28,2023 13:01

గోవా : దసరా వేళ ... జైలులో ఉన్న ఖైదీలంతా టపాసులు కాల్చి రావణుడి దిష్టిబమ్మను దగ్ధం చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారికి తెలియడంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్‌వాలే సెంట్రల్‌ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ చంద్రకాంత్‌ హరిజన్‌, జైలర్లు మహేష్‌ ఫడ్తే, అనిల్‌ గాంకర్‌, అసిస్టెంట్‌ జైలర్‌ రామ్‌నాథ్‌ గౌడ్‌లను సస్పెండ్‌ చేస్తూ, జైలు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఓంవీర్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జైలు ఆవరణలో మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే విషయమై విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్‌ చేశారని ఒక పోలీసుల అధికారి వివరించారు.