Sep 12,2023 10:19

'మా ఇల్లు ఎలా ఉంది? అసలు ఉందా.. లేదా? ఎవరైనా కూల్చేశారా? ఇంట్లో వస్తువులన్నీ ఉన్నాయా.. లేవా? గ్రామానికి ఎవరైనా వచ్చారా?' అంటూ పునరావాస కేంద్రాలకు వెళ్తున్న మీడియా రిపోర్టర్లను మణిపూర్‌ అల్లర్ల బాధితులు అదేపనిగా అడగడం అక్కడ కనిపిస్తోంది. అప్పుడే 48 ఏళ్ల తోంబీ, తన వీపు వెనకున్న గుడ్డ సంచిలో నుండి జారిపోతున్న 18 నెలల మనవరాలు అంజలిని పైకి సర్దుకుంటూ అటువైపుగా వచ్చింది. 'మే నెల మొదటివారంలో మేమంతా ఇక్కడికి వచ్చాం. మీరు మేం ఉంటున్న గ్రామాలకు వెళ్తున్నారంట కదా? అక్కడ వాతావరణం ఎలా ఉంది? మేం ఇక్కడకి వచ్చేశాక మా ఇళ్లను తగలబెట్టేశారని తెలిసింది. గ్రామాలకు గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయాని విన్నాం. అదంతా నిజమేనా? ఇల్లు లేకపోతే మేం ఎక్కడకు పోవాలి? మా పరిస్థితి ఏంటి?' అంటూ ఆమె ఓ రిపోర్టరును అదే పనిగా ప్రశ్నిస్తోంది. ఆమె మాటల్లో ఎంతో ఆందోళన.. భవిష్యత్తు గురించిన దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.

          మణిపూర్‌ లోయల్లో చురచుందపూర్‌, కంగ్పోకీ జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన కట్టడాలే దర్శనమిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఓ మీడియా బృందం ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లినప్పుడు అక్కడే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న మెయితీ, కుకీ తెగల వాళ్లను కలిశారు. అక్కడ కొంతమంది మహిళలు తమ నివాసాలు ఎలా ఉన్నాయోనని దిగులుపడుతుంటే.. మరికొంతమందికి తమ ఇళ్లు కూలిపోయాయని, గ్రామంలో తమకంటూ ఏమీ మిగల్లేదని అర్థమైనట్లు విచార వదనాలతో కనిపించారు.
        ఇంఫాల్‌ పట్టణంలో కుకీలు నివసించే అర కిలోమీటరు పొడవునా కాలిపోయిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. ఆ దృశ్యాలను ఫొటోలు తీయకుండా, లోపలికి ఎవరినీ రానీయకుండా కొన్ని మెయితీ గుంపులు అక్కడ కాపలా కాస్తున్నాయి. 'ఇంఫాల్‌ పక్కనే ఉన్న ఫయేంగ్‌ గ్రామం మాది. మాకు అక్కడ ఓ ఇల్లు ఉంది. గోధుమ పండించుకుంటున్నాం. మూకలు మా గ్రామంలోకి చొరబడ్డాయని తెలిసి ఇల్లు వదిలి వచ్చేశాం. ఒంటి మీద ఉన్న దుస్తులే మాతో ఉన్నాయి. మరో జత బట్టలు కూడా తీసుకోలేకపోయాం. మేం వచ్చేశాక ఆ మూక ఇళ్లను తగలబెట్టేసిందని విన్నాం. ఇప్పుడు మేం ఏం చేయాలి? అంటూ కన్నీరుమున్నీరవుతూ చెబుతోంది పునరావాసంలో ఉంటున్న కుకీ తెగకు చెందిన లెయిమా.
 

                                                                   పునరావాసంలో వ్యత్యాసం

మణిపూర్‌ అల్లర్లలో రెండు తెగల వాళ్లూ బాధితులే.. అయితే ఎక్కువగా ప్రభావితమైందని మాత్రం కుకీలని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ వ్యత్యాసం వారికి ఏర్పాటు చేసిన పునరావాసాల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్మించిన కార్డ్‌బోర్డు క్యాబిన్లతో కూడిన ఇళ్లల్లో ఒక్కొక్క మెయితీ కుటుంబం నివసిస్తోంది. రోజుకు రూ.80 భృతి వారికి ఇస్తున్నారు. వారికిష్టమైన వంట వండుకునే సౌకర్యం కూడా ఉంది. మరోపక్క కుకీల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వ నడపడం లేదు. చర్చిలు నిర్వహించే స్కూళ్లలో వాళ్లు తలదాచుకుంటున్నారు. టార్బలిన్‌ పట్టాలపై, మట్టి నేలపై పడుకుంటున్నారు. ఇక గ్రామాల్లో ఏర్పాటుచేసిన పునరావాసాల్లో అయితే తలుపులు, కిటికీలు లేని ఏక గదుల్లో పదుల కుకీ కుటుంబాలు నివసిస్తున్నాయి. బియ్యం, రోటీ, బంగాళదుంపలే వారికి అందుతున్నాయి. ఇన్ని రోజుల నుండి అవే వారి ఆహారం. ఏ రోజూ మెనూ మారలేదు. ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణంలో కూడా తేడా కనపడుతోంది. మెయితీ ఇళ్లను పునర్నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కుకీలకు అటువంటి భరోసా ఏమీ లేదు.
 

                                                             ఇంకా అక్కడ ఏం కనిపిస్తోందంటే..

మూడు నెలలుగా నిర్జీవమైన ఇళ్లతో నిండిపోయిన ఆ గ్రామాల్లో ఇప్పుడు ఇంకో దృశ్యాలు కనిపిస్తున్నాయి. కూలిపోయిన ఇళ్లను దోచుకునేందుకు కొంతమంది దొంగచాటుగా వస్తున్నారు. విలువైన వస్తువుల కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. ఇటుకలు, ఇనుము, డబ్బు, నగలు, ధాన్యం మూటలు ... ఇలా ఒకటేమిటి చేతికి ఏది వస్తే అది పట్టుకెళ్తున్నారు.
 

                                                            ఇంటి బయట బోర్డులు కనిపిస్తున్నాయి

మణిపూర్‌ లోయలో, కొండల్లో నివసిస్తున్న నాగాలు, మెయితీలు, పంగళ్ల (మెయితీ ముస్లింలు) ఇళ్ల ముందు ఇప్పుడు కొత్తగా నేమ్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జాతి ఘర్షణల నుండి తమను తాము రక్షించుకునేందుకు వారి దుకాణాల ముందు, ఇళ్లతో సహా ఏదేని వారి ఆస్తుల బయట వారు ఏ కమ్యూనిటీకి చెందినవారో తెలియజేసే పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు.
           కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చెలరేగిన అల్లర్లకు ప్రాణాలు కోల్పోయి, గౌరవం పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన కుటుంబాలెన్నో.. బాధితులెవరైనా.. ఏ తెగవారైనా భద్రత కల్పించాల్సిన బాధ్యత పాలకులదే.. కానీ, గూడు చెదిరి, బతుకు లేక.. ఆదుకునే వారు కనిపించక అంధ:కారమైన ప్రజల పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. ఆదుకునేవారు కనిపించక ఇప్పుడు ఆ వర్గం తల్లడిల్లుతోంది. ఆసరా లేక బతుకుపై భయంతో, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వారంతా బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు.

Surviving-without-support
                                        కుకీ పునరావాసంలో తలదాచుకుంటున్న ఓ మహిళ