Nov 28,2022 10:01
  • కౌలు రైతులుగా సిసిఆర్‌సి ఉన్న వారినే గుర్తింపు
  • నెరవేరని వాస్తవ సాగుదారుల గుర్తింపు లక్ష్యం

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : దేశంలో వాస్తవ సాగుదారులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే రాష్ట్రంలో మందగమనంగా సాగుతోంది. 11వ వ్యవసాయ గణనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొత్త వెబ్‌ పోర్టల్‌ను రాష్ట్రాలకు పంపింది. ప్రామాణిక సంవత్సరం 2021-22 ఆధారంగా గ్రామ రికార్డులను ఈ యాప్‌లో నింపి వ్యవసాయ గణన చేపట్టేందుకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఈ నెల ఒకటో తేదీ నుంచి సర్వే ప్రారంభించారు. వ్యవసాయ కమతాల స్వరూప స్వభావాలను, పరిమాణ తరగతుల వారీగా కమతాల సంఖ్య, వాటి విస్తీర్ణం, భూ వినియోగంపై ప్రతి ఐదేళ్లకు ఒకసారి భూకమతాల గణన పేరుతో సర్వేను చేపడుతున్నారు. అభివృద్ధి ప్రణాళికలు, సామాజిక, ఆర్థిక ప్రణాళిక తయారీకి, జాతీయ ప్రాధాన్యత అంశాల తయారీకి ఈ సర్వే ఉపయోగపడుతుందని కేంద్రం తన సర్క్యులర్‌లో పేర్కొంది. పరిమాణ తరగతులు, సామాజిక తరగతులు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, స్త్రీ, పురుషుల వారీగా సమాచారం పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వ్యవసాయ గణన అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అర్థ గణాంక శాఖాధికారి ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ గణనలో వ్యక్తిగత, సమిష్టి, సంస్థాగత కమతాల వివరాలను రైతులను నుంచి సేకరించాల్సి ఉంది. 11వ వ్యవసాయ గణనలో భూ యజమాని, కౌలుదారుని వివరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొదటి దశలో కమతాల వారీగా విస్తీర్ణం, సామాజిక తరగతి, సాగుదారుల లింగభేదాల వివరాలతో సర్వే పూర్తి చేయాలి. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి సర్వే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రంలో మొత్తం 2,19,24,721 కమతాలు ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు 21,87,240 కమతాల వివరాలను మాత్రమే యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాస్తవంగా ఉన్న మార్గదర్శకాల ప్రకారం రైతులను, కౌలు రైతులను కలిసి వారితో మాట్లాడి వివరాలు నమోదు చేయాలి. కానీ రెవెన్యూ అధికారులు తమ వద్ద ఉన్న డేటాను యథాతథంగా కేంద్రం ఇచ్చిన యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ డేటా నమోదులో కూడా మందగమనం కొనసాగుతోంది. ఇంకా 1,97,37,481 కమతాల వివరాలు నమోదు చేయాలని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవ సాగుదారుల గుర్తింపులో కూడా అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా 2019 కౌల్దార్ల గుర్తింపు చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం (సిసిఆర్‌సి) ఉన్న వారినే కౌలు రైతులుగా నమోదు చేస్తున్నారు. వాస్తవంగా భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నా సిసిఆర్‌సి లేకపోతే ఈ వివరాలు నమోదు కావడం లేదు. క్షేత్రస్థాయిలో భూములను సందర్శించి వివరాలు నమోదు చేయకుండా గ్రామ సచివాలయాల్లోనే విఆర్‌ఒలు తమ వద్ద ఉన్న వెబ్‌ ల్యాండ్‌ రికార్డుల ప్రకారం వీటిని నమోదు చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఎస్‌సి, ఎస్‌టిలు, మహిళలు, పురుషులు, చిన్న, సన్నకారు రైతులు, రెండున్నర ఎకరాల దాటి ఉన్న మధ్య తరహా రైతులు, పది ఎకరాలు మించి ఉన్న భూ యజమానులను వేర్వేరుగా గుర్తించారు. కనిష్టంగా పది సెంట్ల వ్యవసాయ భూమి ఉన్నా వారిని కూడా గుర్తించాలని నిర్ణయించారు.