ప్రజాశక్తి-యంత్రాంగం : పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు బుధవారం ఆందోళనలు చేశారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో యూనియన్ బ్యాంకు వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ కౌలు రైతులకు పంట ఋణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలని, భూ యజమానితో సంబంధంలేకుండా సిసిఆర్ కార్డు ఆధారంగా రుణాలు ఇవ్వాలని, ప్రతి కౌలు రైతుకు రూ.1.60 లక్షల వరకు హామీ లేని రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. గుంటూరులోని లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) కార్యాలయం ఎదుట ధర్నాలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు లక్షల మందికిపైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, పంట రుణాలు మాత్రం 70 వేల మందికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో రూ.నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ప్రతి సంవత్సరం కనీసం రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కార్డులు వచ్చిన వారికి కూడా డబుల్ ఫైనాన్స్ పేరుతో పంట రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయన్నారు. జెఎల్‌జి, రైతు మిత్ర గ్రూపులకు కూడా రుణాలు ఇవ్వకుండా అనేక ఆంక్షలు పెడుతున్నారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడం వలన కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకులు షరతులు వీడి కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం లీడ్ బ్యాంక్ మేనేజర్ రత్న మహిపాల్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై లీడ్ బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ కార్డులు వచ్చిన ప్రతివారికి రుణాలు ఇస్తామని, సక్రమంగా నడుస్తున్న గ్రూపులకు కచ్చితంగా రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రియాంకకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ సిసిఆర్‌సి కార్డులు కలిగిన కౌలు రైతులకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.











