Jun 08,2023 08:13
  •  నెల్లూరులో కౌలు రైతుల రక్షణ యాత్ర ప్రారంభంలో వై.రాధాకృష్ణ
  •  కాకినాడ జిల్లాలో కొనసాగిన మరో యాత్ర

ప్రజాశక్తి- యంత్రాంగం : కౌలు రైతుల చట్టాన్ని మార్పు చేయాలని, కౌలు రైతులకు మేలు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ నెల్లూరులో బుధవారం కౌలు రైతు రక్షణ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ప్రారంభమైన మరో యాత్ర కాకినాడ జిల్లాకు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ మండలం పొట్టేపాళెం గ్రామంలో యాత్రను ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. పస్తుతం ఉన్న చట్టాన్ని సవరించి, భూ యజమాని సంతకంతో పనిలేకుండా గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.25 వేలు ఇవ్వాలని, భూమిలేని కౌలు రైతులకు కౌలు భరోసా ఇవ్వాలని కోరారు. దేవాలయ భూమి సాగుదారులకు సిసిఆర్‌సి కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంట సాగు హక్కు పత్రాలు ఇవ్వాలని, కనీస మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించి పంటలను కొనుగోలు చేయాలని, కేరళ రాష్ట్ర ప్రభుత్వ తరహాలో రుణవిముక్తి కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. 60 ఏళ్లు నిండిన కౌలు రైతులకు రూ.6 వేలు పెన్షన్‌ ఇవ్వాలని, కౌలు రైతులను ఇ-క్రాప్‌లో నమోదు చేసి ప్రభుత్వ రాయితీలన్నింటినీ కౌలు రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ యాత్ర ఈ నెల 12న విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా సిసిఎల్‌ఎ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌తో రాయబారం నిర్వహించనుందని తెలిపారు. కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తొలిరోజు యాత్ర పెనుబల్లి, బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, ఇందుకూరుపేట, కోవూరు, యల్లాయపాళెం, కొడవలూరు, విడవలూరు ప్రాంతాల్లో సాగింది. ప్రతిచోట కౌలు రైతులు ఈ యాత్రకు స్వాగతం పలికారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ముత్యాల గురునాథం, జిల్లా ఉపాధ్యక్షులు జి.లక్ష్మీపతి, పి.చంద్రమౌళి, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగలి పులయ్య తదితరులు పాల్గొన్నారు.
అప్పులే మిగులుతున్నాయి

  • కాకినాడ జిల్లాలో కౌలు రైతుల ఆవేదన

అనకాపల్లి జిల్లాలో ప్రారంభమైన కౌలు రైతుల రక్షణ జీపు యాత్ర కాకినాడ జిల్లాలోని కరప, కాజులూరు మండలాల్లో బుధవారం సాగింది. ఈ యాత్రలోని నాయకులు కౌలు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయమూ అందట్లేదని, ఏటా అప్పులు తప్ప ఏమీ మిగలడం లేదని పలువురు వాపోయారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.బాలకృష్ణ మాట్లాడుతూ 2019 సిసిఆర్‌సి చట్టం కౌలు రైతులకు నష్టం చేసే విధంగా ఉందన్నారు. సాగు చేయని భూ యజమానులకు వరంగా మారిందని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వల్లు రాజబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షులు రమేష్‌, మాజీ సర్పంచులు వనం వీరబ్రహ్మం, పెంకే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.