Mar 11,2023 20:15

ప్రజాశక్తి-గుంటూరు :గుంటూరులోని రమేష్‌ ఆస్పత్రికి అరుదైన ఘనత దక్కింది. అత్యంత అరుదైన మెదడు రక్తనాళానికి బైపాస్‌ సర్జరీని విజయవంతం చేసి రోగి ప్రాణాలను కాపాడారు. గుంటూరుకు చెందిన వాసిరెడ్డి సుజాత (69) కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అకస్మాత్తుగా కుర్చీలో నుంచి కింద పడిపోయి స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను రమేష్‌ హాస్పిటల్స్‌ (గుంటూరు)కు తరలించారు. అక్కడ ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎడమవైపు ఉండే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనిలో 90 శాతానికిపైగా పూడిపోయి ఉండటాన్ని గుర్తించారు. సుజాత మెదడుకు తీసుకువెళ్లే ధమనిలో పూర్తిగా కాల్షియం పేరుకుపోయి ఉండడంతో సీనియర్‌ కార్డియాలజిస్టులు డాక్టర్‌ హరిత, వైద్యులు రామారావు, జయరాం పారు, కుమార్‌ వేలు, బికాస్‌ సాహూలతో కూడిన వైద్య బృందం కెరొటిడ్‌ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించింది. సాధారణంగా గుండెకు వెళ్లే రక్తనాళాలకు, పొట్ట, కాళ్ళు, చేతులలో ఉన్న రక్త నాళాలకు బైపాస్‌ సర్జరీ నిర్వహిస్తుంటారు. కానీ అత్యంత క్లిష్టమైన మెదడుకు వెళ్లే రక్తనాళాలకు బైపాస్‌ సర్జరీ నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుందని సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జయరాం పారు తెలిపారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. రమేష్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ వ్యాధిని నిర్ధారించడం, అత్యంత క్లిష్టమైన కెరొటిడ్‌ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ చికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు వైద్య బృందాన్ని అభినందించారు.