చెన్నై : తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని గుండె శస్త్రచికిత్స నిమిత్తం కావేరీ ఆస్పత్రికి తరలించేందుకు మద్రాస్ హైకోర్టు గురువారం అనుమతించింది. సెంథిల్ సతీమణి మేఘల దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జె.నిషా భాను, డి.భరత చక్రవరితో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సెంథిల్ ఆరోగ్య పరిస్థితిపై ఒమందురర్ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రి, ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్య బృందం అందజేసిన నివేదికను మేఘల న్యాయస్థానానికి సమర్పించారు. సెంథిల్‌కు అత్యవసర వైద్య సాయం అందించాల్సిన అవసరం ఉన్నదని వైద్య బృందం అభిప్రాయపడింది. సెంథిల్ ఇప్పటికే ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను సంప్రదిస్తున్నారని డివిజన్ బెంచ్ తెలిపింది. అయితే సెంథిల్‌ను కావేరీ ఆస్పత్రికి తరలించడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించింది. ఈఎస్‌ఐ వైద్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య స్థితిపై నివేదిక ఇచ్చిందని తెలిపింది. సెంథిల్ శరీరంలోని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయని, ఆయనను అరెస్ట్ చేయడానికి ముందు వైద్య పరీక్షలు జరిపామని ఈడీ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ సుందరేశన్ చెప్పారు. ఆ తర్వాత తనకు ఛాతిలో నెప్పిగా ఉందని సెంథిల్ చెప్పడంతో మరోసారి పరీక్ష చేయించామని వివరించారు. సెంథిల్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించే బదులు ఒమందురర్ ఆస్పత్రిలోనే చికిత్స చేయించవచ్చునని వాదించారు. ఈ వాదనతో సెంథిల్ న్యాయవాది ఎలంగో విభేదించారు. సెంథిల్‌కు బైపాస్ సర్జరీ అవసరమని, జ్యుడీషియల్ కస్టడీలోనే ఆయనను కావేరీ ఆస్పత్రికి తరలించవచ్చునని వాదించారు.