Dec 05,2022 11:20

మొట్టమొదటిసారిగా విశ్వాసాల ప్రాతిపదిక చట్టాల అమలు, రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల పరిరక్షణ న్యాయస్థానాల విధి. అటువంటి బృహత్తర కర్తవ్య సాధనలో కోర్టులు విఫలమైతే? అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు- రామజన్మభూమి కేసులో దేశ సర్వోన్నోత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయ వ్యవస్థ సమగ్రతకు, నిష్పక్షపాతానికి మాయని మచ్చే. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ పాలనలో 150 ఏళ్లు, తదుపరి స్వాతంత్య్రం వచ్చాక 70 ఏళ్లు మసీదు-మందిరం వివాదం నడిచింది. ఇంత సంక్లిష్టమైన, దేశ రాజకీయాలను మార్చేసిన, మత విద్వేషాలకు కారణమైన కేసులో సుప్రీం కోర్టు తీర్పు శాస్త్రీయ ఆధారాలపై కాకుండా విశ్వాసాల ప్రాతిపదికన రావడం పెద్ద 'విశేషం'. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బ్రాబ్రీ మసీదును బిజెపి నేత అద్వానీ నేతృత్వంలో సాధు సంతులు, సంఫ్‌ు పరివారం నేలమట్టం చేసింది. ఆ సమయంలో, అనంతరం దేశ వ్యాప్తంగా చెలరేగిన మత ఘర్షణల్లో వేలాది మంది బలయ్యారు. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. అంతటి ఘోర కలిపై పలు దర్యాప్తులు జరిగాయి. అయోధ్యలో మసీదు-మందిరం ఉన్నట్లు చెబుతున్న వివాదాస్పద 2.77 ఎకరాలు తమవేవని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా విరాజిత్‌మాన్‌ అనే సంస్థలు కోర్టుకెళ్లాయి. 2010 సెప్టెంబర్‌ 30న అలహాబాద్‌ హైకోర్టు విచిత్రమైన తీర్పు చెప్పింది. వివాదాస్పద భూమి 2.77 ఎకరాలనూ మూడు సంస్థలూ మూడు సమాన భాగాలుగా పంచుకోవాలంది. ఆ తీర్పును సుప్రీంలో సవాల్‌ చేయగా చిట్ట చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం 2019 నవంబర్‌ 9న తుది తీర్పు చెప్పింది. నాటి చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొరు నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఎస్‌ఎ బాబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉన్నారు. ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పారు.
 

                                                                  లౌకిక సిద్ధాంతానికి విఘాతం

వివాదాస్పద 2.77 ఎకరాలను రామజన్మభూమి నిర్మాణానికి 'సుప్రీం' కేటాయించింది. ఆ స్థలాన్ని కేంద్రం అధీనంలో ఉంచి ఒక ట్రస్టును ఏర్పాటు చేయమంది. ఐదు మాసాల్లో మందిరాన్ని నిర్మించాలంది. రామ్‌లల్లా- రాజజన్మభూమి న్యాస్‌కు భూమినంతా ఇచ్చేసింది. మరో హిందూ సంస్థ నిర్మోహి అఖాడాకు ట్రస్టులో ప్రాతినిధ్యం కల్పించాలంది. ఇంకో వైపు బాబ్రీ మసీదు పునర్నిర్మాణానికి అయోధ్యలోనే కేంద్రం లేదా రాష్ట్రం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.
 

                                                                      నమ్మకమే ప్రాతిపదిక

కూల్చివేయబడిన మసీదు గోపురాల మధ్యనే రాముడు జన్మించాడని హిందువులు బ్రిటిష్‌ వారి కాలం నుంచి విశ్వసిస్తున్నారని కోర్టు విశ్వసించింది. మసీదు ప్రాంగణంలో రామ్‌ చబూత్రాకు అది పరిమితం కాదని నొక్కి చెప్పింది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కంచె వేసిన కారణంగా వారు చబూత్రాకు పరిమితమయ్యారని అభిప్రాయపడింది. మరో వైపు ఆ స్థలంపై తమకు యాజమాన్యపు హక్కు ఉందన్న వక్ఫ్‌ బోర్డు వాదన కూడా రాముడు పుట్టాడన్న నమ్మకానికి ప్రతిబింబం వంటిదేనని రెంటినీ ఒకటిగా చెప్పింది. బాబర్‌ కాలంలో మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదనీ, దాని కింద దొరికిన అవశేషాలు ఇస్లామేతర కట్టడానికి సంబంధించినవనీ సుప్రీం కోర్టు తీర్పులో చెప్పింది. అయితే అవతలి పక్షం వాదిస్తున్నట్టు అది రామాలయం అనడానికి గాని, దాన్ని కూల్చి ఇది కట్టారని చెప్పడానికి గాని ఆధారం లేదని పురావస్తు నివేదికల అధ్యయనంతో నిర్ణయానికి వచ్చింది. అలాగే అక్కడ మసీదు లేదనీ ప్రార్థనలు జరగడమే లేదని చెప్పడం కూడా వాస్తవం కాదని పేర్కొంది. అదే ప్రాంగణంలో గతం నుంచి ఇరుమతాల ప్రార్థనలు జరుగుతుండగా 1949లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి పెట్టడం, 1992లో కూల్చివేత వారి విశ్వాసాలకు విఘాతమని కూడా స్పష్టీకరించింది. ఎక్కడైనాగాని ఆస్తి తగాదాల్లో భూమిపై హక్కుదారును నిర్ధారించేది ఆధారాలు, సాక్ష్యాలపైన. ఈ స్థలం నాది అని ఎవరైనా అంటే మీ వద్ద ఉన్న పత్రాలు తెమ్మంటారు. కానీ సుప్రీం కోర్టు అందుకు భిన్నంగా విశ్వాసాలను ప్రాతిపదికగా చేసుకుంది. ఇంకో విషయం.. బాబ్రీ మసీదు కూల్చివేత తప్పేనని కోర్టు చెప్పింది. కూల్చివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోమనీ పేర్కొంది. మరో వాదనా ఉంది. బాబ్రీ మసీదును కూల్చేశారు కాబట్టి అక్కడ మందిర నిర్మాణానికి అనుమతి లభించింది. అదే మసీదు అలానే ఉంటే మందిర నిర్మాణానికి అనుమతి ఇవ్వడం దుర్లభం. ఇటువంటి సందేహాలకు కోర్టు తీర్పు అవకాశం కల్పించడం విచారకరం.
 

                                                                  ప్రార్ధనా స్థలాల చట్టానికి తూట్లు

సుప్రీం తీర్పు వెలువడగానే అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి, సంఫ్‌ు పరివారం వడివడిగా అడుగులేస్తున్నాయి. అయోధ్యతో ఆగకుండా కాశీ, మధుర, హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి గుడి వంటి వివాదాలకు ఆజ్యం పోస్తోంది. అయోధ్య వివాదం తారాస్థాయికి చేరిన తరుణంలో 1991లో కేంద్రం ప్రభుత్వం.. 1947 ఆగస్టు 15కు (స్వాతంత్య్రానికి) ముందు అయోధ్య మినహా దేశంలో అన్ని ప్రార్దనా స్థలాల యాజమాన్యాలపై యథాతథ స్థితి కొనసాగించే చట్టాన్ని తెచ్చింది. ఆ యాక్టుకు సవరణలు తెచ్చి మరిన్ని మత విద్వేష వివాదాలు సృష్టించాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు పన్నుతున్నాయి. కోర్టులో ఈ విషయంపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ పరిణామం ఆందోళనకరం. మన రాజ్యాంగ పునాది లౌకికతత్వానికి విఘాతం. దేశ సమైక్యత సమగ్రతకు ముప్పు. ప్రజలు జాగరూకత వహించాల్సిన సమయమిది.

-కెఎస్‌వి ప్రసాద్‌