- దర్యాప్తు జాప్యం, తీవ్ర అలసత్వం
- మణిపూర్ మారణకాండపై సుప్రీం సీరియస్
- 7వ తేదీకి పక్కా సమాచారంతో రండి
- మణిపూర్ డిజిపికి ఆదేశాలు
న్యూఢిల్లీ : మే నెలలో జాతుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటి నుండి మణిపూర్‌లో శాంతి భద్రతల యంత్రాంగం, రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలాయని, దర్యాప్తులో జాప్యం, అలసత్వం అడుగడుగునా కనిపిస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మణిపూర్‌లో శాంతి భద్రతలపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు కోర్టు ఎదుట హాజరు కావాలని మణిపూర్ రాష్ట్ర డిజిపిని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కోర్టు అడిగే ప్రశ్నలకు జవాబిచ్చేందుకు తగు సన్నద్ధతతో రావాలని కోరింది.
నేరాలు ఎప్పుడెప్పుడు జరిగాయి, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు, సాక్షుల ప్రకటనల నమోదు, సెక్షన్ 161కింద స్టేట్‌మెంట్ల నమోదు, అరెస్టులకు సంబంధించి తేదీలతో సహా అన్ని వివరాలతో రావాలని కోరింది. హింసాత్మకఘటనలు జరిగిన సమయానికి, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు సమయానికి, సాక్షుల ప్రకటనలు నమోదుకు మధ్య చాలా గ్యాప్ ఉందని తెలిపింది. నిందితులను అరెస్టు చేయడంలోనూ ఉపేక్షే కనబడుతోందని పేర్కొంది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున, అలాగే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, రాష్ట్రంలో పరిస్థితి అనుకూలంగా లేనందున పోలీసుల కదలికకు పరిమితులు వుండవచ్చని వాదించారు.
'' ఏవో ఒకటి రెండు కేసుల్లో మినహా మిగిలిన కేసుల్లో అసలు అరెస్టులే లేవు. దాదాపు రెండు మాసాల తరువాతే ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. బాధితుల ప్రకటనలు కూడా నమోదు చేయలేదు.'' అని చీఫ్ జస్టిస్‌చంద్రచూడ్ పేర్కొన్నారు. వీటిని సిబిఐకి అప్పగించామని తుషార్ మెహతా చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. 6వేలకుపైగా కేసులను సిబిఐ ఒంటి చేత్తో ఎలా దర్యాప్తు చేస్తుందని ప్రశ్నించారు. ఇన్ని వేల కేసుల దర్యాప్తు భారంతో ఇక సిబిఐ 'పనిచేయకుండాపోయే' పరిస్థితి వస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి సిద్ధం చేసిన యథాతథ స్థితి నివేదికను కోర్టు పరిశీలించింది. కారులో వెళుతున్న తల్లీకొడుకులను బయటకు లాగి కొట్టి చంపేశారని, ఈ ఘటన మే 4న జరిగితే జులై 23న కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని కోర్టు పేర్కొంది. ఇలా నెలల పాటు ఆలస్యంగా నమోదైన కేసులు చాలానే వున్నాయి. కొన్ని చోట్ల సిసిటివి ఫుటేజీని కూడా తొలగించిన వైనం వెలుగు చూసింది.
- సిబిఐకి 11 ఎఫ్‌ఐఆర్‌ల బదిలీ
మొత్తంగా 6523 కేసుల ప్రాధమిక దర్యాప్తు జరగగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం 11 కేసులను సిబిఐకి బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు. అయితే తాము కీలకమని పేర్కొన్న ఐదు ఎఫ్‌ఐఆర్‌లు ఆ వాటిలో లేవని జోమి విద్యార్ధి సమాఖ్య తరపు న్యాయవాది తెలిపారు. ఒక మహిళను సజీవంగా దహనం చేసిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ 12వ స్థానంలో వుందని దాన్ని సిబిఐకి అప్పగించలేదని మరో న్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు.
- అరకొర వివరాలతో స్టేటస్‌కో రిపోర్టు
యథాతథ స్థితిపై నివేదిక (స్టేటస్‌కో రిపోర్టు)లో రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సమాచారం అసమగ్రంగాను, అరకొరగాను వుందని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లను వివిధ అంశాలవారీగా విడగొట్టి ఇవ్వడంలోను అలసత్వం ప్రదర్శించారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసుల్లో హత్యలు లేదా అత్యాచారాలు ఎన్ని, లూటీలు, దహనాలకు సంబంధించినవెన్ని,ఆరాధనా స్థలా విధ్వంసానికి సంబంధించినవెన్ని వంటి వివరాలు ఏవీ ఈ నివేదికలో లేవని అన్నారు.










