Sep 05,2023 10:34

 నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత లోనెను ప్రశ్నించిన సుప్రీం
న్యూఢిల్లీ : 
జమ్ము కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగమని బేషరతుగా అంగీకరిస్తానని, భారత రాజ్యాంగం పట్ల విధేయతతో వుంటానని స్పష్టం చేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత మహ్మద్‌ అక్బర్‌ లోనెను సుప్రీంకోర్టు సోమవారం కోరింది. 370వ అధికరణను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. 15రోజులుగా 370వ అధికరణపై సుప్రీంలో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. 2018లో జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ లోనె నినాదాలు చేశారని కేంద్రం, జమ్ము కాశ్మీర్‌ యంత్రాంగం, ఇతర ప్రతివాదులు ఆరోపించారు. భారత రాజ్యాంగం పట్ల తాను విధేయుడిగా వుంటానని పేర్కొంటూ లోనె అఫిడవిట్‌ దాఖలు చేయాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా డిమాండ్‌ చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను దెబ్బకొట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

జమ్ము కాశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించేందుకు కచ్చితమైన కాల పరిమితికి కట్టుబడలేమని అంతకుముందు కేంద్రం తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకు తెలియజేసింది. ఇప్పటి నుండి ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. జమ్ము కాశ్మీర్‌కు కేంద్ర పాలిత ప్రాంతమనే హోదా తాత్కాలికమైనదని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. 2019లో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో తీవ్రవాదం, చొరబాట్లు, రాళ్లు విసిరిన సంఘటనలు, భద్రతా సిబ్బంది మరణాలు తగ్గాయని చెప్పారు. పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆ గణాంకాలతో విభేదించారు. రాజ్యాంగబద్ధమైన వాదనల ప్రాతిపదికన ఈ సవాలు అంశం నిర్ణయించబడుతుంది తప్ప కేంద్రం అందజేసే గణాంకాల ఆధారంగా కాదని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ చెప్పారు.