Jul 09,2022 13:05

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌ సమీపంలో ఏర్పడ్డ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 16 మంది చనిపోయారు. ఇంకా 40 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరదలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరందరిని బేస్‌ క్యాంప్‌ పంచతర్ణికి తీసుకెళ్లారు. జాడ కానరాని వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ 21 మందిని విమానాల ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆర్మీ, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కర్వాల్‌ తెలిపారు. ప్రస్తుతం అక్కడ కొండచరియలు విరిగిపడనప్పటికీ.. వర్షం కురుస్తూనే ఉందని అధికారులు తెలిపారు. చినార్‌ కార్ప్స్‌ కమాండర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎడిఎస్‌ అజ్లౌ .. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభావిత రపాంతాలకు చేరుకున్నారు. కాశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) విజరు కుమార్‌ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.