Feb 10,2023 21:17

అదానీ గ్రూపు వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌. నరసింహ, జస్టిస్‌ జెబి. పార్థివాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హిండెన్‌ బర్గ్‌ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కాగా.. దీనిపై విచారణకు తీసుకుంది. ఇన్వెస్టర్ల భద్రతంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయాలను కోరింది. ఇన్వెస్టర్ల రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం లోగా స్పందించాలని సెబీని కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిబంధనలను ఎలా ఏర్పాటు చేయవచ్చో వివరించాలని కోరింది. ఈ అంశంలో నిపుణలతో కూడిన కమిటీ వేస్తే బాగుంటుందని సూచించింది. అదే విధంగా ఇన్వెస్టర్ల నష్టంపై రిపోర్ట్‌ ఇవ్వాలని సెబీని కోరింది. అదానీ గ్రూప్‌నపై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని సూచించింది. ఇందుకోసం న్యాయమూర్తితో కూడిన నిపుణులైన ప్యానల్‌ బఅందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనే సూచనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లయితే.. ప్రభుత్వ సూచనలతో తిరిగి రావాలిని సోలిసిటర్‌ జనరల్‌కు కోర్టు సూచించింది. అదే విధంగా సెబీకి విస్తృత అధికారాలు కల్పించే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కోరింది. ''భారత ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. వాళ్లను ఎలా రక్షించాలి. రూ.10 లక్షల కోట్లు కోల్పోయారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సెబీ ఎలా చూసుకోవాలి.'' అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిబ్రవరి 13న తిరిగి ఈ కేసును విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.