Aug 06,2023 22:05

హిరోషిమా నగర మేయర్‌ కజుమి మట్సుయి
హిరోషిమా: ఒక వైపు ఉక్రెయిన్‌ యుద్ధం, మరో వైపు కొరియాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ తరుణంలో అణ్వాయుధాలకు మద్దతు పలకడం మూర్ఖత్వమే అవుతుందని హిరోషిమా నగర మేయర్‌ కజుమి మట్సుయి విమర్శించారు. రెండు మాసాల క్రితం హిరోషిమాలో జరిగిన జి-7 కూటమి సదస్సులో అణ్వాయుధాలను కలిగివుండడాన్ని సమర్ధిస్తూ కొందరు నేతలు చేసిన ప్రసంగాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్‌ పశ్చిమ నగరమైన హిరోషిమాపై మొదటి అణు బాంబు దాడి జరిగి 78 ఏళ్లు అయిన సందర్భంగా ఆదివారం నాడిక్కడి శాంతి స్మారక ఉద్యానవనంలో జరిగిన స్మారక కార్యక్రమంలో ఆయన శాంతి ప్రకటన చేస్తూ అణు యుద్ధాలను నిరోధించే సిద్ధాంతాలను వదిలేయడం ప్రమాదకరమన్నారు. ప్రమాదకర వర్తమానం నుండి ఆదర్శవంతమైన భవిష్యత్తు వైపు మనల్ని నడిపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలను ఆయన కోరారు. జపాన్‌ తక్షణమే అణు నిరోధక ఒప్పందంపై సంతకం చేయాలని ఆయన కోరారు. ఆ తరువాత మాట్లాడిన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా అణు నిరోధక ఒప్పందంపై సంతకం చేసేది లేనిది చెప్పకుండా ధర్మోపన్యాసం చేశారు. మే నెలలో హిరోషిమాలో జరిగిన జి-7 శిఖరాగ్ర సదస్సును రాజకీయ స్టంట్‌గా మార్చారని ఆయనపై ఇప్పటికే విమర్శలున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ పంపిన సందేశాన్ని ఈ స్మారక కార్యక్రమంలో చవివి వినిపించారు. ఆగస్టు6, 1945న అమెరికా యుద్ధ విమానం నుంచి జారవిడిచిన అణుబాంబు హిరోషిమా నగరంపై పడి పేలిన కచ్చితమైన క్షణం అయిన ఉదయం.8.15 గంటలకు అందరూ లేచి ఒక్క క్షణం మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి 50 వేల మంది దాకా హాజరయ్యారు. హిరోషిమా, నాగసాకిపై అమెరికా జరిపిన అణుబాంబు దాడుల్లో ఆ సంవత్సరం చివరి నాటికి 1,40,000 మంది చనిపోయారు. ఇప్పటివరకు లెక్కవేస్తే మృతుల సంఖ్య 3,39,227కి చేరింది. వీరందరి పేర్ల జాబితాను సమాధి వద్ద ఉంచారు. అదే సమయంలో జపాన్‌ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోను, అంతకు ముందు చైనా, కొరియాతో సహా అనేక ఆసియా దేశాలపై దురాక్రమణకు, దురాగతాలకు పాల్పడిన చరిత్ర దాచేస్తే దాగేది కాదని హిరోషిమా యూనివర్సిటీ ఎమిరేటస్‌ ప్రొఫెసర్‌ తోషియుకి తనకా పేర్కొన్నారు.