- మహిళలు 'మణిపూర్' దోషులను క్షమించరు
- హిందుత్వ రాజకీయాలే ఈ దుస్థితికి కారణం
- స్త్రీలపై హింసను అరికట్టడానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మణిపూర్‌లో స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించి, మారణకాండకు పాల్పడిన వారిని, వారిని శిక్షించడానికి బదులుగా వెనకేసుకువస్తున్న శక్తులను దేశంలోని మహిళలు ఎన్నటికీ క్షమించరని ఐద్వా సీనియర్ నాయకురాలు బృందా కరత్ అన్నారు. ఐద్వా ఆథ్వర్యంలో విశాఖపట్నం, హిందూపురంల నుండి జులై 28న ప్రారంభమైన 'హింసపై పోరు యాత్ర'ల ముగింపుసభ మంగళవారం విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగింది.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి అధ్యక్షతన జరిగిన ఈ సభలో బృందా కరత్ మాట్లాడుతూ ప్రపంచం నివ్వెరపోయేలా మణిపూర్ హింసాకాండ సాగిందని అన్నారు. పోరుయాత్రలో భాగంగా పర్యటించిన సంఘం నేతలను అన్ని జిల్లాల్లో మహిళలు, విద్యార్థినులు మణిపూర్ సంఘటన గురించి వివరాలు అడిగారని చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మహిళల్లో మణిపూర్ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన నెలకొందని, ఆగ్రహం వ్యక్తమవుతోందని వివరించారు. మూడు నెలలుగా జరుగుతున్న ఈ ఘోరం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ పరిస్థితి ఉండదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తన సోదరిని లైంగికదాడినుండి కాపాడుకునేందుకు 15ఏళ్ల బాలుడు అమరనాథ్ ప్రయత్నిస్తే ఆ బాలున్ని పెట్రోల్‌పోసి తగులబెట్టిన విషయాన్ని బృందా కరత్ ప్రస్తావించారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవస్థీకృత నేరాలకు ఈ సంఘటన నిదర్శనమని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బాలికలు, మహిళలు,దళితులు, ఆదివాసులపై దాడులను నియంత్రించలేని మోడీకి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రిని తక్షణం ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అమలు చేస్తున్న హిందుత్వ రాజకీయాలే ఈ దుస్థితి కారణమని చెప్పారు. ఆదివాసీలను ఊచకోత కోయడంతో పాటు మహిళలను నగంగా ఉరేగిస్తుంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. దేశంలో సంఫ్‌ుపరివార్ ఫాసిస్ట్ చర్యలతో మహిళలకు రక్షణ, భద్రతకు ముప్పు ఏర్పడిందని మహిళలు అంతా సంఘటింతంగా ఈ విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.. సగటున రోజుకు 86మంది మహిళలపై లైంగికదాడులు, 1151 మహిళలపై హింస కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 74శాతం మహిళలపై జరిగే లైంగికదాడుల కేసుల్లో ఎలాంటి శిక్షలు పడటం లేదన్నారు. నరేంద్రమోడి అధికారంలోకి వచ్చిన 2014 నుండి 2022దాకా 35లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాలికలపై లైంగిక దాడులు కేసులు మూడు లక్షలకు పైగా వున్నాయని అన్నారు. ఈ కేసులను త్వరతిగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలపై జరిగే లైంగికదాడుల కేసుల్లో మతం, కులం ఆధారంగా శిక్షలు విధించడం అనాగరికమైన చర్య అని అన్నారు. గుజరాత్ బిల్కిస్‌బానో కేసులో బ్రాహ్మణుల పేరుతో నిందితులను విడుదల చేయడం తగదని తక్షణం వారందరినీ తిరిగి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ తమపై ఏడాది కాలంగా లైంగికదాడులకు పాల్పడుతున్నారని ఢిల్లీలో క్రీడాకారులు ఆందోళన చేస్తుంటే , ప్రధాన మంత్రి ఆయనను తనపక్కన కూర్చొబెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ మహిళల హక్కుల గురించి చైతన్యం చేయాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారికి పాలకవర్గపార్టీలు వెన్నుదన్నుగా వుంటున్నాయని విమర్శించారు. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్‌లను వైసిపి, టిడిపి నాయకులు పెంచి పోషిస్తున్నారన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ మహిళలకు రక్షణకల్పించలేని ప్రభుత్వాలకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హతలేదన్నారు. మద్యం, మత్తుమందు, ఫోర్న్ వీడియోల వల్లే మహిళలు, బాలికలపై హింస ఎక్కువగా జరుగుతోందని చెప్పారు. అమర్‌నాథ్ ఘటనలోనూ దోషులను శిక్షించలేదన్నారు. విశాఖలో మైనర్ బాలికను గర్బవతిని చేసిన స్వామిజీ విషయంలోనూ ఇదే స్థితి నెలకొందన్నారు. మహిళలను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో 7వేల మంది బాలికలు, 22వేల మంది మహిళలు అదృశ్యమైనా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలు, డ్వాక్రా మహిళలతో చర్చించి మహిళల భద్రతకు ఒక విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకులు పుతుంబాక భారతి, యార్లగడ్డ జోయ, శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ కె ధనలక్ష్మి, మధ్యాహ్నా భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి, ఐద్వా రాష్ట్ర నాయకులు సావిత్రి, ఎన్ అలివేలు తదితరులు పాల్గొన్నారు.
అమర్‌నాథ్ కుటుంబసభ్యులకు బృందాకరత్ పరామర్శ
ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా) : దుండగుల చేతిలో కిరాతకంగా హత్యకు గురైన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, రాజోలు పంచాయతీ ఉప్పాలవారిపాలెంలో పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్ కుటుంబాన్ని వీడియో కాల్ ద్వారా ఐద్వా నాయకులు బృందాకరత్ మంగళవారం పరామర్శించారు. ఘటన వివరాలను మృతుని తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ.. 'ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నారు' అని వారించినందుకు దుండగులు కక్షపూరిత ధోరణితో అమర్‌నాథ్‌ను కిరాతకంగా హత్య చేశారన్నారు. నిందితులను బెయిల్‌పై విడుదల చేయడం దుర్మార్గమన్నారు. దోషులకు శిక్ష పడకుండా ఆర్థిక, అధికార బలంతో కొందరు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే అమర్‌నాథ్ కుటుంబసభ్యులకు రక్షణ లేకుండా పోతుందని చెప్పారు. వెంటనే నిందితులకు బెయిల్ రద్దు చేయాలని, జస్టిస్ వర్మ సిఫారసు ప్రకారం 45 రోజుల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు డి.రమాదేవి, కెవిపిఎస్ నాయకులు కె.శరత్ పాల్గొన్నారు.